ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలో గిరిజన కుటుంబాలకు షాకిచ్చింది విద్యుత్ శాఖ. కనీసం బల్బు పెట్టుకోలేని స్థితిలో ఉన్న వారికి రూ.6 వేల నుంచి రూ.1 కోటి వరకు బిల్లులు వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. గడువులోపు కట్టకపోతే భూములను వేలం వేస్తామని బెదిరిస్తున్నారు అధికారులు.
"విద్యుత్ శాఖకు చెందిన అధికారులు నా ఆధార్ కార్డు తీసుకొని సౌభాగ్య పథకం కింద నాకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి మాకు విద్యుత్ సౌకర్యం ఉంది. ఏడాది గడిచిన తర్వాత బిల్లు రూ. 1,13,18,400 వచ్చింది. మా కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యాం. అప్పటి నుంచి నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. పైగా బిల్లు మొత్తం చెల్లించకుంటే నా భూమిని వేలం వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. "
--- అమర్నాథ్, బాధితుడు, ఆరంగ్ పాణి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సౌభాగ్య ప్రధాన్ మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన' కింద గిరిజన కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు అక్కడి అధికారులు. అయితే ఒక్క అమర్నాథ్ ఇంటిలోనే కాదు.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల్లో 156 ఇళ్లకు అధిక మొత్తంలో బిల్లు వచ్చింది. మరో గ్రామానికి చెందిన దాసాయి రాము అనే వ్యక్తికి రూ.66,11,457 బిల్లు వచ్చింది.