తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య మందిరానికి ఆకృతినిచ్చింది ఆ కుటుంబమే.. - Lawyer Iqbal Ansari got first invitation of Ram MAndir

అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. అడుగడుగునా విశిష్టతలతో.. రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగరంగ వైభవంగా భూమిపూజ చేయడానికి ట్రస్ట్‌ సిద్ధమైంది. ఈ ఆలయానికి ఆకృతిని రూపొందించిన సోమ్‌పుర కుటుంబీకులది తరతరాలకూ వన్నె తరగని చరిత్ర.. ఆ విశేషాలు తెలుసుకుందాం..

Sri Ram Mandir Bhumi Poojan first invitation for Iqbal Ansari
అయోధ్య మందిరానికి ఆకృతినిచ్చింది ఆ కుటుంబమే..

By

Published : Aug 5, 2020, 9:48 AM IST

నాడు సోమనాథ్‌, అక్షర్‌థామ్‌.. నేడు అయోధ్య రామమందిరం.. దేశంలోని ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులను సోమ్‌పుర కుటుంబీకులే రూపొందించారు. ఇలాంటి నిర్మాణాల్లో 15 తరాలుగా ఈ కుటుంబీకుల అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది.

రామ మందిర నమూనా

అయోధ్య నిర్మాణంలోనూ..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర కుటుంబీకులు దేశ, విదేశాల్లో ఇంతవరకు దాదాపు 131 ఆలయాలను డిజైన్‌ చేశారు. వీటిలో లండన్‌లోని స్వామినారాయణ్‌ ఆలయం కూడా ఒకటి. అమెరికాలోనూ కొన్ని ఆలయాలకు వీళ్లే ఆకృతులను రూపొందించారు. తాజాగా అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరాన్ని డిజైన్‌ చేసింది ఇదే కుటుంబానికి చెందిన 77 ఏళ్ల చంద్రకాంత్‌ సోమ్‌పుర; ఆయన కుమారులు నిఖిల్‌ సోమ్‌పుర (55), ఆశీష్‌ సోమ్‌పుర(49). వీరికి నిఖిల్‌ పెద్ద కుమారుడు కూడా సహకారం అందిస్తున్నారు. తన తాతతో కలిసి చంద్రకాంత్‌ భాయ్‌ సోమ్‌పుర గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయానికి (స్వాతంత్య్రానంతరం జరిగిన పునర్నిర్మాణం) కూడా డిజైన్‌ చేశారు.

రామ మందిర నమూనా

14 పుస్తకాలు, పద్మశ్రీ..

తరతరాలుగా చేస్తున్న ఈ వృత్తిలో భాగంగా చంద్రకాంత్‌, బాల్యంలోనే తన తాత ప్రభాశంకర్‌ సోమ్‌పుర నుంచి ఆలయ ఆకృతులకు సంబంధించిన మెలకువలను నేర్చుకోవడం ప్రారంభించారు. వాస్తుశాస్త్ర విషయాలు సహా అనేకాంశాలను ఆయన ఔపోశన పట్టారు. శిల్ప శాస్త్రాలకు సంబంధించి ప్రభాశంకర్‌ 14 పుస్తకాలు రాశారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. బిర్లా కుటుంబంతో కలిసి కూడా ఆలయాల నిర్మాణంలో ఈ కుటుంబం పాలు పంచుకుంది. వారే తమను విహెచ్‌పీకి చెందిన అశోక్‌ సింఘాల్‌కు పరిచయం చేసినట్లు ఆశీష్‌ చెబుతుంటారు.

రామ మందిర నమూనా

ఒకేసారి 8 ఆలయ ప్రాజెక్టులు..

చంద్రకాంత్‌ ఇంటినే కార్యాలయంగా చేసుకుని పనిచేస్తూ తన కుమారులకు మార్గదర్శకం చేస్తున్నారు. నిఖిల్‌, ఆశీష్‌లే శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సమావేశాలకు హాజరవుతూ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలను చర్చిస్తున్నారు.

"మేము చేసే డిజైన్లను నాన్న పరిశీలిస్తారు. తగిన సూచనలిస్తారు. ఒకేసారి 8 ఆలయ ప్రాజెక్టుల డిజైన్‌లను తయారుచేసే పనుల్లో ఉన్నాం. వీటిలో గుజరాత్‌లోని పావగఢ్‌ దేవస్థానం పని కూడా ఒకటి."

-ఆశీష్‌ సోమ్‌పుర

1989 నుంచే రామ మందిరం ఆకృతిపై ఈ కుటుంబీకులు పనిచేస్తూ వచ్చారు. గత ఏడాది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనంతరం రామమందిరం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచీ వీరు సంబంధిత ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నారు. ఎన్నోదఫాలుగా చర్చలు జరిగాయి.

వృత్తాకార పరిధిలో.. అష్టభుజి ఆకృతితో

భారత్‌లో ఆలయాల నిర్మాణానికి ప్రధానంగా 3 రకాల శైలిలో ఆకృతులను రూపొందిస్తుంటారు. వాటిలో నాగర ఒకటి. ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయం కూడా ఇదే శైలిలోనే నిర్మితమైంది. కాగా అయోధ్యలో నిర్మితం కానున్న రామమందిరం గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఆలయ పరిధి వృత్తాకారంలో ఉంటుంది. 30 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన రామమందిరం ఆకృతిలో తర్వాత కొన్ని మార్పులు చేశారు. రెండంతస్తులకు బదులు మూడంతస్తుల్లో నిర్మించనున్నారు. ఆలయం పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 360, 235, 161 అడుగులుగా నిర్ణయించారు. ప్రతిపాదిత రామ మందిరం మూల నిర్మాణాకృతిని అలాగే ఉంచారు. మూడో అంతస్తు నిర్మించడానికి నిర్ణయించడంతో ఎత్తు 33 అడుగులు పెరిగింది. 3 చోట్ల 5 గుమ్మటాలుంటాయి.

రామ మందిర నమూనా

ABOUT THE AUTHOR

...view details