కరోనాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ మూడో దశ ట్రయల్స్ భారత్‌లో కొనసాగుతున్నాయి. టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని సంస్థ ఇదివరకే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సులభంగా రవాణా చేసే సౌకర్యం ఉండటం, అందుబాటు ధరలో లభించడం ఆక్స్ఫర్డ్ టీకా ప్రత్యేకత. భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ డోసులను ఉత్పత్తి చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌కు యూకే రెగ్యూలేటరీ ఆమోదించడం, స్వదేశంలో తయారైన టీకానే ప్రజలకు అందిస్తామని ప్రధాని మోదీ సైతం ఉద్ఘాటించిన నేపథ్యంలో తొలుత ఈ టీకా అనుమతులు లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఈ టీకాలపై ప్రజలు వ్యక్తం చేసిన సందేహాలు, వాటికి సమాధానాలను మీకోసం.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కొత్త స్ట్రెయిన్(పరివర్తనం చెందిన వైరస్)పై సమర్థంగా పనిచేస్తుందా?
బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వెర్షన్ వైరస్‌పైనా ఈ టీకా సమర్థంగా పనిచేస్తుందని పరిశోధకులు నమ్మతున్నారు. వైరస్ పరివర్తనం చెందుతోంది తప్ప.. పూర్తిగా మారిపోలేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టీకా సమర్థతపై మ్యుటేషన్(వైరస్‌లో మార్పు) ప్రభావం ఉండదని భావిస్తున్నారు.
ఫైజర్, మోడెర్నాతో పోలిస్తే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎలా భిన్నం?
స్పైక్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసేందుకు వైరస్ జన్యుక్రమంపై ఆధారపడి ఆక్స్ఫర్డ్ టీకా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ డబుల్ స్ట్రాండెడ్ 'డీఎన్ఏ'ను ఉపయోగిస్తుంది. కానీ ఫైజర్, మోడెర్నా టీకాలు సింగిల్ స్ట్రాండెడ్ 'ఆర్ఎన్ఏ'ను వినియోగిస్తాయి.
అడినోవైరస్పై ఉన్న ప్రోటీన్ పొర కారణంగా ఆక్స్ఫర్డ్ టీకాలో ఉన్న జన్యు పదార్థాలు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఈ టీకాను అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఆరు నెలల వరకు ఈ టీకాను నిల్వ చేయవచ్చు. కానీ మోడెర్నా టీకాను మైనస్ 4, ఫైజర్ టీకాను మైనస్ 70 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.