బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. పాత నినాదాలు, మూసధోరణిలోనే ప్రసంగం సాగిందని మండిపడ్డారు పలు పార్టీల నేతలు. నిరుద్యోగం, ఆర్థిక మందగమనంపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు.
''కొన్నేళ్లుగా మూసధోరణితో కూడిన పాత నినాదాలను వింటున్నాం. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నా, ముఖ్యంగా వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు కోల్పోతున్నా,ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా వీటిపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం బాధను కలిగించింది.
-కాంగ్రెస్
రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష నాయకులు గులాం నబీ ఆజాద్, సీతారం ఏచూరీ తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందని ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదమని అన్నారు ఆజాద్. సీఏఏ గురించి రాష్ట్రపతి ప్రస్తావించటం సిగ్గుచేటు అని వెల్లడించారు.