ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థలకు ఉన్న రక్షణలను తొలగించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో పోస్ట్ చేసే సమాచార విశ్లేషణ, ప్రచారం కల్పించడంలో వినియోగించే ప్రమాణాలు, నిబంధనల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే అంశాల్లో అల్గారిథమ్‌లను వినియోగిస్తున్నామన్న పేరుతో చాలాకాలంగా పరిశీలించడం మానేశాయి. అయితే సామాజిక దిగ్గజాలు ఉపయోగించే అల్గారిథమ్‌లు వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛకు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ఈ సాంకేతికతను పరిశీలించాలని పేర్కొంటున్నారు రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్.
"సామాజిక మాధ్యమాల నియంత్రణ విధానంలో చాలా తీవ్ర సమస్యలున్నాయి. భారత రాజ్యాంగం వ్యక్తులకు భావప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. అయితే ఆర్టికల్ 19(2) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని ప్రత్యేక పరిమితులు మాత్రమే ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు ఏ పోస్ట్‌కు అయినా ప్రాచుర్యం కల్పించేందుకు.. అణిచిపెట్టి ఉంచేందుకు ఉపకరించే సాంకేతికతను కలిగి ఉన్నాయి."
-రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ, రాజ్యసభ
సాంకేతికతకూ పక్షపాతం..
సామాజిక మాధ్యమాలు ఉపయోగించే సాంకేతకతకు విశ్వసనీయత ఉండాలని అభిప్రాయపడ్డారు రాజీవ్. సామాజిక మాధ్యమాలు ఉపయోగించే ప్రమాణాల్లో పారదర్శకత లేదని ఆయన గత కొంతకాలంగా వాదిస్తున్నారు. వ్యక్తులు పెట్టే పోస్ట్‌లను విశ్లేషించి ఆటోమేటిక్‌గా అనుమతించకపోవడంపై అభ్యంతరం లేవనెత్తారు రాజీవ్. ఇందులో సామాజిక మాధ్యమాల పాత్ర ఏమీ లేదని వాదించడం సరికాదన్నారు. సాంకేతికతను తయారుచేసింది మనుషులేనని పేర్కొన్నారు. మనుషులకు పక్షపాతం ఉన్నప్పుడు సాంకేతికతకు కూడా పక్షపాతం ఉంటుందని చెప్పుకొచ్చారు.