తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: 5% ఓట్లు ఫేస్​బుక్​, ట్విట్టర్​వే! - ప్రభావం

రాజకీయం రణరంగమైంది. రెండు సైన్యాల హోరాహోరీ పోరుతో యుద్ధభూమి దద్దరిల్లుతోంది. కానీ... ఇక్కడ మారణాయుధాలు లేవు. ఉన్నది... మాటల తూటాలే. రక్తపాతం లేదు. జరుగుతోంది... 'సోషల్​' సంఘర్షణే. వేదిక... సామాజిక మాధ్యమాలే. ఎందుకు ఇదంతా? ఎన్నికల్లో డిజిటల్​ ప్రచారానికి ఎందుకింత ప్రాధాన్యం?

ఎన్నికల్లో డిజిటల్​ ప్రచారానికి ఎందుకింత ప్రాధాన్యం?

By

Published : Mar 26, 2019, 7:32 AM IST

ఎన్నికల్లో డిజిటల్​ ప్రచారానికి ఎందుకింత ప్రాధాన్యం?
యువ భారత్​...! దేశంలో 65శాతం జనాభా వయసు 35ఏళ్లలోపే. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్క ఓటుతో మార్చగల సత్తా వారి సొంతం. ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తున్నాయి. విద్య, ఉపాధి, వైద్యం, మెరుగైన భవిష్యత్​... ఇలా ఎన్నో హామీలు ఇస్తున్నాయి. మరి ఆ సమాచారం యువతకు చేరేదెలా?

"యువత టీవీ చూడరు. యూట్యూబ్​లో వీడియోలు చూస్తారు. వారు వార్తా పత్రికలు చదవరు. సామాజిక మాధ్యమాలు చూస్తారు. పత్రిక, టీవీలో ఏం వచ్చిందన్నది వారికి అనవసరం. వారు సామాజిక మాధ్యమాల్లో చూసిన సమాచారంతోనే ప్రభావితం అవుతారు."
--టీవీ మోహన్​ దాస్​ పాయ్​, ఇన్ఫోసిస్​ మాజీ సీఎఫ్​ఓ

ఈ లోక్​సభ ఎన్నికల్లో సాంకేతికతే కీలకం. అది సామాజిక మాధ్యమాలు కావచ్చు, అనలిటిక్స్​ కావచ్చు, వ్యూహరచన కావచ్చు. ప్రతి విషయంలోనూ సాంకేతికత ఎంతో ముఖ్యం"
--ఆర్​. చంద్రశేఖర్​, నాస్కామ్​ మాజీ అధ్యక్షుడు

అందుకే అన్ని పార్టీలు సాంకేతికతపై దృష్టిపెట్టాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న కోటిన్నర మంది యువతను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాలను అస్త్రాలుగా ఎంచుకున్నాయి.

ప్రధాన రాజకీయ పార్టీల డిజిటల్​ సైన్యాలు... ఇప్పటికే అంతర్జాల లోకాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు.

"యువత, ముఖ్యంగా తొలిసారి ఓటువేసే వారు ఎక్కువగా సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తుంటారు. వారికి సమాచారం చేరడానికి అదే ప్రధాన మార్గం. వారికి సోషల్ మీడియా ద్వారా అందే సమాచారం 40-50శాతం యువత ఆలోచనను ప్రభావితం చేసే అవకాశముంది."
--టీవీ మోహన్​ దాస్​ పాయ్​, ఇన్ఫోసిస్​ మాజీ సీఎఫ్​ఓ

విమర్శలు కాదు... విజయగాథలే....

సోషల్ మీడియా నేడు ఒక శక్తిమంతమైన సాధనం. వ్యక్తుల ఆలోచనా విధానాల్ని మార్చగల సత్తా సామాజిక మాధ్యమాల సొంతం. కానీ... అదెలా సాధ్యం?

"యువ ఓటర్లను ప్రభావితం చేయాలంటే... ముందు వారి ఆలోచనలు, అభిరుచులు తెలుసుకోవాలి. వారికి పంపే సందేశాలు భవిష్యత్​పై భరోసా కలిగించేలా, ఆశావాద దృక్పథంతో ఉండాలి.
ఉదాహరణకు.... భారత్​ను ప్రపంచ దేశాలు ఎలా చూస్తాయో తెలుసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే... విదేశాల్లో పనిచేయడం చాలా మంది కల. అంతర్జాతీయ స్థాయిలో భారత్​ కీర్తిని పెంచేందుకు ప్రభుత్వం ఏం చేసిందో తెలిపే కథనాలు యువతపై ప్రభావం చూపుతాయి."
--టీవీ మోహన్​ దాస్​ పాయ్​, ఇన్ఫోసిస్​ మాజీ సీఎఫ్​ఓ

తెరపై సినిమా మాత్రం మరోలా!

విజయగాథలతోనే సానుకూల ప్రభావం అన్నది నిపుణుల మాట. కానీ... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది మాత్రం పూర్తి భిన్నం. ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​... ఏది చూసినా విమర్శలమయమే, అసత్యాల పుట్టే. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఎంతటి స్థాయికైనా తెగిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకుని, నిర్ణయం తీసుకోవడం ఓటరు బాధ్యత.

ఎన్నికల సంఘం ఏమంటోంది?

అసత్య వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. సామాజిక మాధ్యమాల యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అసత్య, అభ్యంతరకర పోస్టులకు కత్తెర వేసేలా సూచనలు చేస్తోంది. సామాజిక మాధ్యమాల యాజమాన్యాలూ ఇందుకు సానుకూలంగా స్పందించడం శుభపరిణామం.

"4-5శాతం ఓట్లను సామాజిక మాధ్యమాలు ప్రభావితం చేసే అవకాశముంది."
--టీవీ మోహన్​ దాస్​ పాయ్​, ఇన్ఫోసిస్​ మాజీ సీఎఫ్​ఓ

"2-3శాతం ఓట్లను సామాజిక మాధ్యమాలు ప్రభావితం చేయొచ్చు. అనేక నియోజకవర్గాల్లో అతి స్వల్ప తేడాతో ఫలితం తారుమారయ్యే పరిస్థితి ఉన్న భారత్​లో... ఈ ఓట్ల బదిలీ ఎంతో కీలకం."
--ఆర్​. చంద్రశేఖర్​, నాస్కామ్​ మాజీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details