ఆర్య సమాజ్ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఇటీవల దిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్)లో చేరారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతన్న ఆయన.. శుక్రవారం గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆర్యసమాజ్ అధ్యక్షుడిగా..
1939 సెప్టెంబర్ 21న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు అగ్నివేశ్. నాలుగేళ్లకే తండ్రి మరణించడం వల్ల తాత వద్దే పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి లా, కామర్స్‌లో పట్టా పొందారు. ఆర్య సమాజ్ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన అగ్నివేశ్.. 1977లో హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగానూ సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు 'బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్'ను స్థాపించారు. మావోయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్ అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా పదేళ్ల పాటు(2004-2014) కొనసాగారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రజాందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా గడపదాటని జనం.. రోడ్డెక్కని వాహనం!