కరోనా సంక్షోభం, లాక్డౌన్ వేళ చాలా మంది భవిష్యత్తుపై భయంతో గడిపితే.. మరి కొందరు మాత్రం తమలోని కళను, సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేశారు. ఈ రెండో కోవలోకి చెందినవాడే కేరళ కొచ్చికి చెందిన కుర్రాడు హర్షద్. సొంతంగా ఓ మోటార్ సైకిల్ రూపొందించి అందరి చేత భళా అనిపించుకుంటున్నాడు.
నాన్న నేర్పిన విద్య
ఎర్నాకుళంలోని పల్లూరుతి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న హర్షద్కి బైక్ అన్నా, బైక్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం. అందుకే వాళ్ల నాన్న నడిపే మెకానిక్ షాపులో ఉంటూ సాయం చేస్తుండేవాడు. తండ్రి ద్విచక్రవాహనాలను రిపేర్ చేయడం దగ్గరగా పరిశీలించి.. అలా బైక్ అసెంబ్లింగ్ నేర్చుకున్నాడు.
లాక్డౌన్ కలిసొచ్చింది..
ఇంతలో కరోనా సంక్షోభం తలెత్తడం, లాక్డౌన్తో పాఠశాలలకు సెలవులు రావడం వల్ల హర్షద్ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ సమయాన్ని వృధా చేయకుండా తనలోని సృజనాత్మకతను వెలికితీశాడీ కుర్రాడు. తాతకు చెందిన పాత మోటారు సైకిల్లోని ఇంజిన్ తీసుకుని, తండ్రి షాపులోని పరికరాలను ఉపయోగించి సొంతంగా తనే ఓ మోటార్ సైకిల్ తయారుచేశాడు.