తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: చిన్నోళ్లైనా చితక్కొడతారట - SP

త్రిముఖ పోరు. అంతుచిక్కని సామాజిక సమీకరణాలు. దిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే ఉత్తర్​ప్రదేశ్​లో సత్తా చాటడం అనివార్యం. ప్రతి సీటు అవసరం. ఒక్కో ఓటు కీలకం. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటున్నాయి చిన్న పార్టీలు. ఫలితాన్ని నిర్ణయించేది మేమే అంటూ... ప్రధాన పార్టీలను వెంట తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో చిన్నపార్టీలే కీలకం

By

Published : Mar 20, 2019, 1:27 PM IST

Updated : Mar 20, 2019, 1:34 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో చిన్నపార్టీలే కీలకం

"మత్స్యకారులే మా ప్రధాన ఓటు బ్యాంకు. కూటమి గెలుపునకు మా ఓట్లు ఎంతో కీలకం"
--నిషద్ పార్టీ

"12-15 సీట్లలో ప్రత్యక్షంగా, 30 నియోజకవర్గాల్లో పరోక్షంగా ఫలితాన్ని ప్రభావితం చేసేది కుర్మీ ఓటర్లే. మాకు 2 సీట్లే కేటాయించినా... కుర్మీ ఓట్లన్నీ మిత్రపక్షానికి బదిలీ అయ్యేలా చూస్తాం"
--అప్నాదళ్​(ఎస్​)

ఉత్తర్​ప్రదేశ్​లో ఇలాంటి ప్రకటనలు చేసే పార్టీలు చాలానే ఉన్నాయి. భాజపా, కాంగ్రెస్​, ఎస్పీ, బీఎస్పీతో పోల్చితే... ఈ పార్టీలు ఎంతో చిన్నవి. అయినా.... ఫలితాన్ని ప్రభావితం చేయగలమంటూ పెద్ద పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. కావాల్సిన స్థానాల కోసం పట్టుబడుతున్నాయి. మరికొన్ని చిన్నపార్టీలు మాత్రం సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరక వేచిచూస్తున్నాయి.

కూటమితో నిషద్​..

నిర్బల్​ ఇండియన్​ శోషిత్ హమారా ఆమ్​ దళ్​-నిషద్​ పార్టీ.... యూపీలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ కూటమితో జట్టుకట్టింది. నిషద్​కు సమాజ్​వాదీ పార్టీ రెండు లోక్​సభ స్థానాలు ఇచ్చింది.

"ఒకస్థానంలో మా అభ్యర్థి ఎస్పీ గుర్తుపై పోటీ చేస్తారు. మరోస్థానంలో ఎస్పీ అభ్యర్థి మా పార్టీ గుర్తుపై బరిలో ఉంటారు. గోరఖ్​పూర్​ నుంచి ప్రవీణ్​ నిషద్​ పోటీ చేస్తారు. ఉప ఎన్నికల్లో మాదిరే ఇప్పుడూ అక్కడ భాజపాను ఓడిస్తాం."
-- సంజయ్​ నిషద్​, నిషద్​ పార్టీ అధ్యక్షుడు

కమలంతోనే అప్నాదళ్

ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న అనుప్రియా పటేల్​ నేతృత్వంలోని చిన్న పార్టీ అప్నాదళ్​(సోనేలాల్​). ఆ పార్టీ యూపీలో లోక్​సభ ఎన్నికల కోసం భాజపాతో పొత్తు కుదుర్చుకుంది. అప్నాదళ్(ఎస్​)​కు భాజపా రెండు సీట్లు కేటాయించింది.

"ఈ ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉన్న చోట మా వల్ల వచ్చే ఓట్లే నిర్ణయాత్మకం అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉండే కుర్మీ ఓటర్లు మా మద్దతుదారులే. ఇది భాజపాకు బాగా లాభిస్తుంది"
--అరవింద్​ శర్మ, అప్నాదళ్​(ఎస్​) అధికార ప్రతినిధి

ఎస్​బీఎస్​పీ ఎదురుచూపులు

యూపీలో మరో చిన్న పార్టీ అయిన ఎస్​బీఎస్​పీ పొత్తు కోసం వేచిచూస్తోంది. భాజపా, మహాకూటమి, కాంగ్రెస్​ల కోసం తలుపులు తెరిచే ఉంచింది. రాష్ట్రంలో మాత్రం ఈ పార్టీ భాజపాతో ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్​ రాజ్​భర్​... యోగి ఆదిత్యనాథ్​ మంత్రివర్గంలో సభ్యుడు.

"మా పార్టీ దాదాపు 50స్థానాల్లో ఎన్నికలను ప్రభావితం చేయగలదు. సీట్ల కేటాయింపుపై సరైన హామీ ఇచ్చే వరకు భాజపాతో పొత్తు గురించి చెప్పలేం. మా పార్టీకి 5 స్థానాలు ఇవ్వాలని ఇప్పటికే భాజపాకు చెప్పాం. మా వల్ల వచ్చే ఓట్లు ఎంత విలువైనవో అన్ని పార్టీలకు తెలుసు "
-- అరవింద్​ రాజ్​భర్​, ఎస్​బీఎస్​పీ ప్రధాన కార్యదర్శి

సందిగ్ధంలో పీస్ ​పార్టీ

కొన్ని నెలల వరకు ఎస్పీ-బీఎస్పీతో కలిసే ఉన్నామని సంకేతాలిచ్చిన పీస్​ పార్టీ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. మెరుగైన అవకాశం కోసం వేచిచూస్తోంది.

"కాంగ్రెస్​, ఎస్పీ-బీఎస్పీ కూటమి మాతో కలిసి వస్తాయో లేదో తేల్చుకోవాలి. మా సమయాన్ని వారు వృథా చేస్తున్నారు. మేం ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యాం. 50 నుంచి 80 స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది."
-- మహ్మద్​ అయూబ్​, పీస్​ పార్టీ అధ్యక్షుడు

ప్రియాంక రాకతో..

ప్రియాంక రాకతో సంప్రదాయ ఓట్లను కాంగ్రెస్​ పార్టీ కాపాడుకోగలదని అభిప్రాయపడ్డారు జేఎన్​యూ అధ్యాపకుడు, రాజకీయ విశ్లేషకుడు సంజయ్​.కె.పాండే. అందుకే రాష్ట్రంలో త్రిముఖ పోరు తప్పదని, ఈ ఎన్నికల్లో చిన్నపార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని విశ్లేషించారు.

" ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చిన్నపార్టీల వల్ల వచ్చే ఓట్లే చాలా కీలకం కానున్నాయి"-- సంజయ్​ పాండే

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లేకుండా పొత్తు కుదుర్చుకున్నాయి ఎస్పీ, బీఎస్పీ. ఉత్తరప్రదేశ్​లోని 80లోక్​సభ స్థానాల్లో 38స్థానాలను బీఎస్పీ, 37స్థానాలను ఎస్పీ పంచుకున్నాయి. ఆ తర్వాత కూటమిలోకి వచ్చిన ఆర్​ఎల్​డీకి ఒక సీటు ఇచ్చాయి. రాహుల్​ గాంధీ, సోనియా గాంధీ కోసం రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలపడం లేదు.

కాంగ్రెస్​... చిన్నపార్టీలైన మహాన్​దళ్​, అప్నాదళ్​(కృష్ణ పటేల్​ వర్గం)తో పొత్తు పెట్టుకుంది.

Last Updated : Mar 20, 2019, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details