కోట్ల మంది భారతీయుల కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2.. చివరి దశలో తడబడింది. అయితేనేం.. మన ఇస్రో శాస్త్రవేత్తల ముందు ఎన్నో సవాళ్లను, అనుభవాలను మిగిల్చింది. జాబిల్లి ఉపరితలాన్ని ఆఖరి నిమిషంలో గట్టిగా ఢీకొట్టిన విక్రమ్ ల్యాండర్ జాడ కనుక్కోవడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తలమునకలయ్యాయి. కానీ, ల్యాండర్ ఆచూకీ చిక్కలేదు. అయినా ప్రయత్నాలు కొనసాగించాయి. ఎట్టకేలకు దాని కచ్చితమైన జాడ ఒక భారతీయుడికే చిక్కింది. చెన్నైకి చెందిన ఒక సాధారణ ఇంజినీరు షణ్ముగ సుబ్రహ్మణియన్ ఇచ్చిన ఆధారమే దాని జాడను కనుక్కోవడంలో నాసాకు కీలకమైంది. చివరికి నాసా విక్రమ్ జాడను గుర్తించింది.
మెకానికల్ ఇంజినీరు...
చెన్నైకు చెందిన షణ్ముగ సుబ్రహ్మణియన్.. ఒక మెకానికల్ ఇంజినీర్. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న వ్యక్తి. టెక్నికల్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. అలాగే సాంకేతిక అంశాలపై బ్లాగ్ రాస్తుంటారు. చంద్రయాన్-2తో, నాసాతో ఇతడికి ఎలాంటి సంబంధం లేదు. విక్రమ్ జాడను నాసా కూడా కనుక్కోలేకపోవడం అతన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మనమెందుకు ఓ ప్రయత్నం చేయొద్దని అనుకున్నారు షణ్ముగ. సవాల్‌గా స్వీకరించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు.
ఇలా కనుగొన్నారు...
విక్రమ్ ల్యాండర్.. విఫలమైన తర్వాత నాసా దాని జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్(ఎల్‌ఆర్‌వో) కెమెరాతో తీసిన కొన్ని చిత్రాలను సెప్టెంబరు 17న విడుదల చేశారు. కానీ, అప్పుడు ల్యాండర్ దిగాల్సిన ప్రాంతంలో చీకటిగా ఉన్నందున నాసా ఎలాంటి ఆనవాళ్లను గుర్తించలేకపోయింది. కానీ షణ్ముగం అవే చిత్రాలను ఆధారం చేసుకున్నారు. విక్రమ్ ల్యాండర్ ప్రయోగానికి ముందు జులై 16న తీసిన చిత్రాన్ని.. సెప్టెంబరు 17న నాసా విడుదల చేసిన చిత్రాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. దీనికోసం అతను ఎంతగానో శ్రమించారు. సాఫ్ట్‌వేర్ డెవలపింగ్పై కూడా పట్టు ఉండటం అతడికి ఎంతగానో ఉపయోగపడింది.
నాసా చిత్రాల్ని పిక్సెల్ టు పిక్సెల్ అధ్యయనం చేశారు. ల్యాండర్ సంబంధాలు కోల్పోయినప్పుడు ఉన్న వేగం, ఎత్తు ఆధారంగా కొన్ని లెక్కలు వేసి అది దిగాల్సిన ప్రాంతం.. దాని పరిసరాలను అధ్యయనం చేశారు. లక్షిత ప్రదేశానికి 1కి.మీ దూరంలో ఉపరితలంపై మార్పులు ఉన్నట్లు గమనించారు. అదే విక్రమ్ జాడ అని భావించారు. తన అధ్యయనాన్ని ఆధారాలతో సహా నాసాకు మెయిల్ ద్వారా పంపారు. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న నాసా అక్టోబర్ 14, 15, నవంబర్ 11న ఎల్‌ఆర్‌వో ద్వారా మరికొన్ని చిత్రాలు తీసింది. ఈసారి వెలుతురు ఉండడంతో షణ్ముగం గుర్తించిన ప్రదేశంతో పాటు మరో 24చోట్ల మార్పులు ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. అలా విక్రమ్ శకలాలు, అది కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించగలిగారు.
ఎలాంటి సంబంధమూ లేదు!
సుబ్రహ్మణియన్ అధ్యయనంపై నాసా ఎల్‌ఆర్‌ఓ ప్రాజెక్టు శాస్త్రవేత్త నోవా పెట్రో స్పందించారు. ‘‘ఈ వ్యక్తి చేసిన అద్భుత అధ్యయనం మాకు ఎంతో ఉపయోగపడింది. అతడికి ఎల్‌ఆర్‌ఓ ప్రాజెక్టుతో గానీ, చంద్రయాన్-2 మిషన్‌తో గానీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఈ ప్రయోగంపై ఉన్న ఆసక్తితో మా సమాచారాన్ని వినియోగించుకొని ఉపరితలంపై మేం గుర్తించలేకపోయిన తేడాను గమనించగలిగారు. ఇందుకోసం అతను ఎంతో శ్రమించి ఉంటారు’’ అని నోవా పెట్రో తెలిపారు. అయితే విక్రమ్ శకలాలను తొలుత కనుగొన్న ఘనతను నాసా.. షణ్ముగానికే ఇచ్చింది. ఈ మేరకు అతడికి ఇ-మెయిల్ ద్వారా లేఖ కూడా పంపింది.
షణ్ముగ శ్రీనివాసన్ స్పందన "నాసా సెప్టెంబర్ 17న తన బ్లాగ్‌లో చంద్రుడి చిత్రాలను పోస్ట్ చేసింది. నీడలు ఉన్న కారణంగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుక్కోలేకపోతున్నామన్న నాసా ప్రకటనతో వారు ఉంచిన 1.5 జీబీ చిత్రాన్ని డౌన్లోడ్ చేసి పరిశీలించడం ప్రారంభించాను. ఒక స్థలంలో ముందు చిత్రాలతో పోల్చితే ఒక ప్రదేశంలో అసాధారణంగా కనిపించింది. అక్కడే శకలాలు ఉంటాయని అనుకున్నాను. ట్విట్టర్, ఈ-మెయిల్ ద్వారా నా అంచనాను నాసాకు చెప్పాను. ఈ రోజు ఉదయం నా అభిప్రాయంతో ఏకీభవిస్తూ నాసా ఈమెయిల్ పంపింది. వారి నుంచి సమాధానం చూశాక ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే 4-5 రోజుల పాటు 5 నుంచి 7 గంటల పాటు కష్టపడ్డాను. నేను నా సమాధానాన్ని పంపాక ఇంకా వెతకలేదు. నాకు తెలుసు నేను చూపిన స్థలంలోనే శకలాలు పడిపోయాయని. మిగతా శకలాలు దాని చుట్టుపక్కల ఉంటాయని అనుకున్నాను."
-షణ్ముగ సుబ్రహ్మణియన్
ఇదీ చూడండి: ప్లాస్టిక్ వ్యర్థాల దుస్తులతో నయా ఫ్యాషన్ షో