తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర'చట్టంపై అట్టుడికిన భారతావని.. ఆరుగురు మృతి

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలతో యావత్‌ భారతావని అట్టుడికిపోతోంది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. 50 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌ ఆజాద్‌ రాకతో శుక్రవారం దిల్లీలోని జామా మసీదు వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఇవాళ తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరిస్థితి చేయిదాటి పోతున్నందున పౌర చట్టంపై కేంద్ర సర్కారులో కాస్త కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. సీఏఏ పై సూచనలు స్వీకరించేందుకు సిద్ధమని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Six people died in Anti CAB protests in UP
'పౌర'చట్టంతో కంపించిన భారతావని.. యూపీలో ఆరుగురు మృతి

By

Published : Dec 21, 2019, 5:54 AM IST

Updated : Dec 21, 2019, 8:02 AM IST

'పౌర'చట్టంపై అట్టుడికిన భారతావని.. ఆరుగురు మృతి

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉత్తర్​ప్రదేశ్​ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బిజ్నోర్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మేరఠ్‌, సంభాల్‌, ఫిరోజాబాద్‌, కాన్పూర్‌లో ఒక్కొక్కరు మరణించారు.

యూపీలో విద్యాసంస్థలకు సెలవు

గోరఖ్‌పూర్‌, సంభాల్‌, భదోహి, బహ్రయిచ్‌, బులంద్‌శహర్‌, ఫిరోజాబాద్‌ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల తర్వాత అల్లర్లు జరిగాయి. రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులుపై రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితులు విషమించినందున పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రబ్బరు తూటాలతో కాల్పులు జరిపారు. 50 మందికి పైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యూపీ సర్కార్‌ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

పోలీసుల అదుపులో భీమ్​ ఆర్మీ అధినేత

భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌ ఆజాద్‌.. దిల్లీలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో నాటకీయ పరిణామాలు జరిగాయి. పోలీసుల కళ్లుగప్పి శుక్రవారం జామా మసీదులోకి ప్రవేశించిన ఆయనను ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

అట్టుడుకిన రాజధాని

దేశ రాజధాని దిల్లీని ఆందోళనలు కుదిపేశాయి. దర్యాగంజ్‌ ప్రాంతంలో నిరసనకారులు ఓ కారుకు నిప్పంటించారు. 40 మందిని అదుపులోకి తీసుకోగా వారిని విడుదల చేయాలని దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇండియా గేట్‌ సమీపంలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు.

హోంమంత్రి అమిత్‌ షా నివాస సమీపంలో నిరసనకు దిగిన.. దిల్లీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శర్మిష్ట ముఖర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. జామియా వర్సిటీని జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యుల బృందం సందర్శించింది.

కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలోనూ..

కర్ణాటకలోనూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళూరు, దక్షిణ కన్నడ, ఉడిపి, కొడగు, చిక్‌మంగళూరులో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్రలోని బీడ్‌, నాందేడ్‌, పర్బాణీ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. బస్సులపై రాళ్లు రువ్వారు.

కేరళలోని కోజికోడ్‌లో బస్సులను అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోనూ నిరసనలు కొనసాగాయి. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 10రోజుల తర్వాత అసోంలో అంతర్జాల సేవలు ప్రారంభమయ్యాయి. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా చెన్నైలో భాజపా భారీ సభ నిర్వహించింది.

Last Updated : Dec 21, 2019, 8:02 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details