జమ్ముకశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతా బలగాలు 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్, షోపియాన్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు... నిర్బంధ తనిఖీలు చేపట్టి ముష్కరులను హతమార్చాయి.
మసీదులో చొరబడిన ముష్కరులు
పుల్వామా పొంపోర్ ప్రాంతంలోని మీజ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉండడాన్ని గమనించిన భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. దీనితో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీనితో ఓ ఉగ్రవాది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మరో ఇద్దరు అక్కడ నుంచి తప్పించుకుని ఓ మసీదులోకి చొరబడ్డారు. రాత్రంతా వారు మసీదులోనే ఉన్నారు. దీనితో శుక్రవారం తెల్లవారుజాము వరకు వేచి ఉన్న భద్రతా దళాలు .. చివరకు బాష్పవాయువు ప్రయోగించాయి. దీనితో కలుగులో చిక్కుకున్న ఎలకల్లాగా ఊపిరి ఆడక... బయటకొచ్చిన ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీటుగా స్పందించిన భద్రతా బలగాలు వారిని అక్కడికక్కడే అంతమొందించాయి.
ఈ ఎన్కౌంటర్లో మసీదు పవిత్రతకు ఎలాంటి భంగం కలిగించకుండా.. ముష్కరులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ తెలిపారు.