తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సిన్ తయారీలో అగ్రరాజ్యాలతో భారత సంస్థల పోటీ - కరోనా వైరస్ తాజా వార్తలు

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. భారత్​లోనూ ఆరు సంస్థలు టీకా తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వైరస్​కు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని విరుగుడు అందుబాటులోకి రావాలంటే చాలా కాలం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

VIRUS-VACCINE
వ్యాక్సిన్ తయారీ

By

Published : Apr 16, 2020, 4:45 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు భారత సంస్థలు అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నాయి. కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ రూపొందించేందుకు ఆరు భారతీయ సంస్థలు కృషి చేస్తున్నాయని ప్రముఖ శాస్త్రవేత్తలు తెలిపారు.

"జైడస్ కాడిలా రెండు వ్యాక్సిన్​లపై ప్రయోగాలు చేస్తోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్​ బయోటెక్​, ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, మైన్​వ్యాక్స్ ఒక్కో వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తున్నాయి. "

- గగన్​దీప్ కాంగ్, టీహెచ్​ఎస్​టీఐ ఫరీదాబాద్

2021లోపు కష్టమే..

వ్యాక్సిన్ అభివృద్ధి చేయటం దీర్ఘకాల ప్రక్రియ అని రాజీవ్​గాంధీ జీవసాంకేతిక కేంద్రంలోని శాస్త్రవేత్త శ్రీకుమార్ అన్నారు. వివిధ దశల పరీక్షలను దాటేందుకు, ప్రభుత్వాల ఆమోదం పొందేందుకు నెలల సమయం పడుతుందన్నారు. ఫలితంగా ఈ ఏడాదిలో కొవిడ్- 19కు వ్యాక్సిన్​ వచ్చే అవకాశం లేదన్నారు.

"వ్యాక్సిన్​ మనుషులకు ఎలాంటి హాని కలిగించదని నిర్ధరించుకునేందుకు తొలుత తక్కువ మందిపై ప్రయోగిస్తారు. అనంతరం వందల మందిపై రెండోదశ పరీక్షలు చేస్తారు. అప్పుడే వైరస్​ను వ్యాక్సిన్ ఎలా ఎదుర్కొంటోందన్న విషయాన్ని అంచనా వేస్తారు. "

- శ్రీకుమార్

వ్యాక్సిన్ తయారీ పూర్తయిన తర్వాత కూడా అనేక సవాళ్లు ఉంటాయని శ్రీకుమార్ తెలిపారు. అన్ని వయస్కుల వారిపై పనిచేస్తుందా? వైరస్​ జన్యు నిర్మాణాన్ని మార్చుకునే క్రమంలో దాన్ని ఎదుర్కోగలదా? వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 70 సంస్థలు వ్యాక్సిన్ తయారీపై కృషి చేస్తున్నాయి. డబ్ల్యూహెచ్​ఓ జాబితాలో జైడస్ కాడిలా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉన్నాయి.

అమెరికా-చైనా పోటాపోటీ

చాలా వరకూ ల్యాబ్ టెస్టింగ్, జంతువులపై ప్రయోగం వంటి ప్రీ క్లినికల్ దశలోనే ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వీటిల్లో 3సంస్థలు మాత్రం చాలా ముందు ఉన్నాయని పేర్కొంది. ఇందులో అమెరికాకు చెందిన రెండు సంస్థలు మానవుల ప్రయోగంలో మొదటిదశలో ఉండగా.. చైనాకు చెందిన ఒక సంస్థ రెండో దశకు చేరుకుంది.

అమెరికా ఆధారిత మోడర్నా రూపొందించిన ఎంఆర్​ఎన్ఏ-1273, చైనాలోని కాన్సినో బయోలాజికల్స్ నుంచి ఏడీ5-ఎన్​సీఓవీ, అమెరికా ఇనావియో తయారుచేసిన ఐఎన్​ఓ-4800 వ్యాక్సిన్లను మానవులపై ప్రయోగించాయి.

అయితే కరోనా వ్యాక్సిన్​ను విజయవంతంగా రూపొందించినా.. జన్యు క్రమ మార్పులు తరచూ వేధిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సార్స్​, మెర్స్​కు వ్యాక్సిన్​ కనిపెట్టే క్రమంలో పరిశోధకులు ఈ సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు.

ఇదీ చూడండి:' మహారాష్ట్ర కచ్చితంగా కరోనా ప్రమాదంలో ఉంది'

ABOUT THE AUTHOR

...view details