తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్టికల్​ 370 రద్దుతో ఉగ్రవాదానికి కళ్లెం పడిందా? - ఆర్టికల్​ 370

ఉగ్రవాదం. వేర్పాటువాదం. కశ్మీర్‌ను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలివి. అయితే, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత.. అక్కడ శాంతి పునరుద్ధరిస్తామని చెప్పారు. జనజీవనం సాధారణ స్థితికి రాగానే కొత్త కశ్మీర్‌ను చూస్తారని స్పష్టం చేశారు. కానీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోయలో మిలిటెన్సీ తగ్గించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు.. విమర్శలకు తావిస్తున్నాయి. రెండు నెలలు కఠినమైన లాక్‌డౌన్‌ అమలైన సమయంలోనే ఉగ్రవాదుల ఏరివేతలో.. భారీ సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. అయితే, ఇది శాంతి స్థాపనకు బదులుగా లోయలో రక్తపుటేర్లు పారిస్తోందంటున్నారు పరిశీలకులు.

situation of militancy in Jammu Kashmir after abrogation of article 370
ఆర్టికల్​ 370 రద్దుతో ఉగ్రవాదానికి కళ్లెం పడిందా?

By

Published : Aug 5, 2020, 10:39 AM IST

అధికరణ 370 రద్దు అయ్యి ఏడాది కాగా.. అక్కడ సాధించిన విజయాల్లో కేంద్రం ప్రధానంగా చెబుతోంది.. ఉగ్రవాదుల ఏరివేత. లెక్కల్లో ఈ ఏడాది కాలంలో జరిగిన రకరకాల ఆపరేషన్లలో 178 తీవ్రవాదులు హతమయ్యారని సాక్ష్యాలతో సహా చెబుతోంది కేంద్రం. కశ్మీర్‌ లోయలో శాంతి స్థాపనకు ఇదే తొలి అడుగని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి.

స్వయంప్రతిపత్తి రద్దు చేస్తూ జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చటం వల్ల నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే లోయలో శాంతి పునరుద్ధరణ సాధ్యపడుతుందనీ పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త ఇబ్బందులు వస్తున్నాయన్న అసహనం కనిపిస్తోంది.

రగులుతూనే అశాంతి..

ఇక కేంద్రం చెప్పినట్టుగా కశ్మీర్‌ లోయలో ఘర్షణ వాతావరణమైనా ముగిసిందా అంటే లేదనే అంటున్నారు పరిశీలకులు. 370 అధికరణ రద్దుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు భాజపా నేతలు.. 'లోయలో వేర్పాటు వాదాన్ని, ఉగ్రవాదాన్ని ఆర్టికల్ 370 పెంపొందించింది..!' అని వ్యాఖ్యానించారు. స్వయం ప్రతిపత్తి రద్దుతో ఈ సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం అక్కడ దాదాపు 8 నెలల పాటు కర్ఫ్యూ విధించింది.

భద్రతా బలగాల 'ఎటాక్​'...

అయితే ఈ ఏడాది కాలంలో ఆ అశాంతి ఇంకా రగులుతూనే వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలు మొదట్లో కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్లీ వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. జమ్ముకశ్మీర్‌లో లాక్‌డౌన్‌ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న సాయుధ బలగాలు ముష్కరమూకలపై విరుచుకుపడ్డాయి. మెరుపు వేగంతో దాడులు చేస్తూ.. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా అనేక ఆపరేషన్లు చేపట్టాయి. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా.. భద్రతా దళాలు ముష్కరుల ఏరివేతను ముమ్మరంగా చేశాయి.

లాక్‌డౌన్‌లో చేపట్టిన యాంటీ-మిలిటెన్సీ ఆపరేషన్లలో భాగంగా.. జమ్మూ-కశ్మీర్‌లో పెద్ద ఎత్తున దాడులు చేశాయి భద్రతా బలగాలు. 30 ఏళ్లుగా కశ్మీర్‌కు కంట్లో నలుసులా ఉన్న ఉగ్రవాద సమస్యను అంతమొందించటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తున్న భద్రతాదళాలు.. ముష్కర మూకలకు తేరుకునే సమయమే ఇవ్వట్లేదు. గతేడాది రాష్ట్ర విభజన తర్వాత లోయలో అగస్టు 5 నుంచే జనసంచారంపై ఆంక్షలు విధించారు. ఆ తర్వాత కరోనా సంక్షోభానికి ముందే ఆ ఆంక్షలు ఎత్తేశారు. ఆ లోపే మళ్లీ కరోనా లాక్‌డౌన్‌ విధించారు. ఈ అంశాన్నే అవకాశంగా మలుచుకున్న భద్రతా దళాలు ముష్కరులపై వరస దాడులు చేశాయి.

ముఖ్యంగా ఉగ్రవాదులు కదలికలతో ఎప్పడూ ఉద్రిక్తతలతో ఉండే దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌, పుల్వామా, కుల్గాం వంటి ప్రాంతాల్లానే ఎక్కువగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలోనూ జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగడంతో కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన రకరకాల ఆపరేషన్లలో 178 తీవ్రవాదులు హతమయ్యారు.

పెరిగిన హింస...

ఈటీవీ భారత్‌ సేకరించిన సమాచారం ప్రకారం చూస్తే.. గతేడాది ఆగస్టు 5 వ తేదీ నుంచి కశ్మీర్‌ లోయలో హింస పెరిగింది. 2019 ఆగస్టు 5 నుంచి 2020 జులై 23వ తేదీ వరకు జమ్ము, కశ్మీర్‌లో భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య మొత్తం 112 ఎన్‌కౌంటర్లు, దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో తీవ్రవాదులతో పాటు, 39 మంది భద్రతా సిబ్బంది, 36 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

నిఘా వర్గాల పక్కా సమాచారంతో.. ఉగ్రవాదులను ఏరివేసే పనిలో బలగాలు చర్యలు తీసుకున్నాయి. భారత గడ్డపై తీవ్రవాదుల కార్యకలాపాలను అడ్డుకోవటమే లక్ష్యంగా... జనవరి నుంచే ప్రణాళికలు రచించిన సైన్యం లాక్‌డౌన్‌తో కొత్త పద్ధతుల్లో దూకుడుగా ముందుకెళ్లింది.

అయితే ఈ తరహాగా ఘటనల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. స్థానికుల్లో అసహనం పెరిగిపోయింది. యువతలో మరింత కసి పెరిగిందని.. తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందే అల్లర్లు, విధ్వంసం చెలరేగకుండా... అంతర్జాలం, ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ల్యాండ్‌లైన్ సేవలనూ కొన్ని నెలల పాటు నిలిపివేసింది. ఈ సమయంలో జనంలోంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

అలాగే.. ఎదురుకాల్పుల్లో ఎవరైనా తీవ్రవాది మృతిచెందితే అమరవీరుడిగా చూసేవారు. అంత్యక్రియలు భారీగా నిర్వహించేవారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతుండటం వల్ల కొంతమంది ముష్కరులు ఆ గుంపులో తప్పించుకునేవారు. ఈ పరిణామాలు బలగాలకు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టేవి. కానీ, కరోనా కాలంలో అంత్యక్రియలకు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో మృతదేహాలను వారి కుటుంబాలకు అందించకుండా, అతి తక్కువ మందితో పోలీసులే వాటిని ఖననం చేస్తున్నారు. మెజిస్ట్రేట్‌ ఆధ్వర్యంలో జనావాసాలకు దూరంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా స్థానికుల్లో ఆగ్రహం పెంచుతోంది.

సవాళ్లు ఎన్నో.. ఫలితం మాత్రం..!

అయితే, టెలీ కమ్యూనికేషన్‌ సేవలు పూర్తిగా నిలిపివేయటం వల్ల తీవ్రవాదుల కదలికలూ తగ్గాయి. ఫలితంగా...ఆ సమయంలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిలిపివేసినట్టు భద్రతా అధికారులు తెలిపారు. మొత్తంగా.. కశ్మీర్‌ లోయలో శాంతి నెలకొల్పటమే లక్ష్యం అని కేంద్రం చెబుతుంటే.. అందుకు విభిన్నంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. ఇక ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తున్న యువత సంఖ్యా పెరుగుతోంది. తీవ్రవాదాన్ని సహించేది లేదన్న మోదీ సర్కార్‌ ఆదేశాలకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తే...అంతకు ముందున్న పరిస్థితులకూ ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ కనిపించటం లేదు. శాంతి, సంక్షేమ లక్ష్యాలు పెట్టుకున్నా వాటిని సాధించటంలో మాత్రం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details