సరిహద్దులో నెలన్నరగా గిల్లికజ్జాలకు దిగుతున్న డ్రాగన్ సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ దొంగదెబ్బ తీసింది. ఇరు వైపులా సైనికుల ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోవడమో, గాయపడటమో జరిగినట్లు అనధికార సమాచారం. చైనా చాన్నాళ్లుగా 'అదిగో సైనిక ఉపసంహరణ'.. 'ఇదిగో శాంతి' అంటూ వల్లెవేస్తూ.. తాజాగా అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంది. సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై చైనా సైనికులు ఒక ప్రణాళిక ప్రకారం ఆకస్మికంగా విరుచుకుపడ్డారు. రాళ్లు, ఇనుపకడ్డీలు, కర్రలతో పేట్రేగిపోయారు. ఫలితంగా హిమప్రాంతం నెత్తురోడింది. గాల్వాన్ లోయలో జరిగిన ఈ దుశ్చర్యను భారత జవాన్లు దీటుగా ఎదుర్కొన్నారు. తెలుగు యోధుడు కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు(39) వీరోచితంగా ఎదురొడ్డారు. సముద్రమట్టానికి 14వేల అడుగులు ఎత్తులో.. శీతల వాతావరణంలో చైనా సైనికుల ఆగడాలను అడ్డుకుంటూ సింహంలా పోరాడి వీర మరణం పొందారు. ఈ ఘటనలో సంతోష్ సహా 20 మంది సైనికులు చనిపోయారు. తొలుత ముగ్గురు సైనికులే మరణించారని సైన్యం ప్రకటించింది. తరువాత మరో ప్రకటన విడుదల చేసింది. ఘర్షణలో తీవ్రంగా గాయపడి, అక్కడి శీతల వాతావరణ వల్ల మరో 17 మంది సైనికులు కూడా చనిపోయారని తెలిపింది. ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కిమళ్లాయని పేర్కొంది.
సంతోష్‌ది సూర్యాపేట జిల్లా