చైనాతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని భారత సైన్యాధిపతి ముకుంద్ నరవాణే స్పష్టం చేశారు. దేహ్రాదూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ సైనికాధికారుల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆయన... సరిహద్దుల వద్ద పరిస్థితి అంతా అదుపులో ఉందని తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల నుంచి అధికారుల స్థాయిలో చర్చలు ప్రారంభించామన్న నరవాణే... భవిష్యత్తులోనూ చర్చలు కొనసాగిస్తామని చెప్పారు.
"చైనాతో సరిహద్దుల వద్ద పరిస్థితి అంతా అదుపులో ఉంది. సైనికాధికారుల స్థాయిలో చర్చల పరంపరను ఇప్పటికే ప్రారంభించాం. కోర్ కమాండర్ స్థాయిలో జూన్ 6న చర్చలు జరిగాయి. దాని తరువాత కూడా అనేక భేటీలు స్థానిక స్థాయిలో కమాండర్, సమాన హోదా కలిగిన అధికారుల మధ్య జరిగాయి. ఈ చర్చలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని భావిస్తున్నాను. ఇరువైపులా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రస్తుతానికి పక్కనపెట్టాం."
- ముకుంద్ నరవాణే, భారత సైన్యాధిపతి