వార్షిక బడ్జెట్ ప్రతులను సూట్‌కేస్‌లో తీసుకొచ్చే సంప్రదాయానికి స్వస్తి పలికిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి ఎర్రటి రంగు పౌచ్‌లో ట్యాబ్‌తో పార్లమెంట్‌కు వచ్చారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్ ప్రతుల ముద్రణ లేనందున ట్యాబ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఎన్డీఏ సర్కారు 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. సూట్‌కేస్ సంప్రదాయానికి తెరదించుతూ.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏడాది 2020లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి కరోనా నేపథ్యంలో.. ఎర్రటి వస్త్రానికీ స్వస్తిపలికి అదే రంగులోని పౌచ్‌లో ట్యాబ్‌ను తీసుకొచ్చారు.
సూట్‌కేస్ చరిత్ర ఇదీ..
బడ్జెట్‌ను ఫ్రెంచ్ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్ అర్థమే లెదర్ బ్యాగ్. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్‌స్టోన్ మొదట లెదర్ బ్యాగ్‌లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
బ్రిటిష్ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్ సూట్‌కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్‌కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్‌కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.
ఈ సూట్‌కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్‌లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.