దేశంలోనే అత్యధిక జనసాంద్రత గల నగరాల్లో ముంబయి ఒకటి. దేశ ఆర్థిక రాజధాని. ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో పాటు.. పొట్టచేత బట్టుకుని వచ్చే... గంపెడు ఆశలు మోసుకుని వచ్చే మరెంతోమందికి అదే గమ్యస్థానం.
ఈ జనసమ్మర్థ నగరాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రంగా కలవర పెడుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహరాష్ట్రలో, ముఖ్యంగా ముంబయి మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న తీరే అందుకు కారణం. ఈ నెల 9వ తేదీన అక్కడ మొదటి కరోనా కేసు వెలుగు చూసింది.
జనసాంద్రత అధికం..
చైనాలో 1 చదరపు కిలోమీటర్‌కు 148 జససాంద్రత ఉంటే భారత్‌లో అది 420 అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముంబయి నగరంలో అయితే 2,463 జనసాంద్రత ఉంది. అందుకే ఎప్పుడూ కిక్కిరిసి కనిపిస్తుంటుందీ నగరం.
ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ ధారావి... ముంబయిలోనే ఉంది. దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చితే వచ్చి పోయే విదేశీయుల సంఖ్య ఎంతో ఎక్కువ. ఈ కారణాలన్నీ ఒకదానికి మరొకటి తోడై... అక్కడ కరోనా కేసుల్ని పెంచేస్తున్నాయి.
ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉండడం సానుకూలాంశమే. అయినా, దేశవ్యాప్తంగా చూస్తే అతి వేగంగా, 20% పైగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం ముంబయి, పుణె, నాగపుర్ లాంటి నగరాలకే పరిమితమైన కరోనా... గ్రామాలకూ విస్తరిస్తే పరిస్థితి ఏంటా అని? వైద్య నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు..
కరోనా వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీని కంటే ముందే పలు రాష్ట్రప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో నిర్భంధాలు ప్రకటించాయి. అందులో మెుదటగా మహారాష్ట్రలోనే 144 సెక్షన్ విధించారు. వైరస్ తీవ్రతను ముందే అంచనా వేసిన ఉద్ధవ్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. 50% మేర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది.
ప్రైవేటు కార్యకలాపాలు దాదాపు నిలిచిపోగా... కొన్ని అత్యవసర విభాగాలు మాత్రమే పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లాల సరిహద్దులు మూసివేశారు. ప్రభుత్వ , ప్రైవేటు రవాణా రద్దు చేశారు. అత్యవసర వాహనాలు మినహా ఏ వాహనాలను రోడ్లపైకి రానివ్వట్లేదు.
లాక్‌డౌన్ కారణంగా నిరాశ్రయులైన వలస కూలీలను ఆదుకునేలా... రాష్ట్రవ్యాప్తంగా 163 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం గూమికూడకుండా.. ఆ షాపులు 24 గంటల పాటు తెరిచి ఉంచేలా ఆదేశాలిచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో కరోనాపై వదంతుల కట్టడిలో భాగంగా పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్న వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పుణె పరీక్ష కేంద్రం..