తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేలలోకి పంపితే నీరు.. రైతన్నకు ఉండదిక కన్నీరు!

నీటి విలువ రైతుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. అందుకే నీటిని వృధా చేసే ఆలోచన రైతన్నకి రానేరాదు. ఇక ఆ నీటిని ఒడిసిపట్టే చిట్కాలు తెలిస్తే ఊరుకుంటాడా? వృధాగా పోయే నీటిని బంధించి అవసరమున్నప్పుడు వాడుకుంటాడు. అచ్చంగా తమిళనాడు రైతు ఇదే చేశాడు.

నేలలోకి పంపితే నీరు.. రైతన్నకు ఉండదిక కన్నీరు!

By

Published : Jul 12, 2019, 5:31 AM IST

నేలలోకి పంపితే నీరు.. రైతన్నకు ఉండదిక కన్నీరు!
తమిళనాడులోని నాగపట్టినం జిల్లాకు చెందిన బాలకృష్ణన్​ అనే రైతు సులభంగా భూగర్భ జలాలను పెంపొందిస్తున్నాడు. పొలానికి నీరు పెట్టే మోటరుతోనే వర్షపు నీరు వృధాగా పోకుండా నీటిని భూగర్భానికి చేరవేస్తున్నాడు. అందుకోసం నీరు వెనక్కి పోకుండా సబ్​మెర్సిబుల్ మోటర్​కు ఉండే 'నాన్​ రిటర్న్​ వాల్వ్​'ని తీసేశాడు. వర్షపు నీరు వృధాగా పోకుండా భూగర్భంలోకి పంపే ప్రయత్నం చేసి విజయవంతం అయ్యాడు.

ఆలోచన ఎలా వచ్చిందంటే...

బాలకృష్ణ ఓ రోజు తన 12 ఎకరాల పొలానికి నీరు పెట్టి మోటరు ఆపిన కాసేపటికి పైపుల ద్వారా వేగంగా నీరు వెనక్కి వెళ్లడం గమనించాడు. బోరు నీటిని వెనక్కి లాగుతోందని అర్థం చేసుకున్నాడు. అప్పుడే అతనికి ఆలోచన పుట్టింది. ఇంకేముంది వర్షపు నీటిని, పొలంలో అవసరానికి మించి పంపయిన నీటిని ఓ కుంటలోకి చేరేలా మళ్లించి భూగర్భంలోకి పంపి నీటి వనరులను పెంచుకుంటున్నాడు.

సైఫన్​ విధానం ద్వారా ఇలా నీటిని తిరిగి భూగర్భంలోకి పంపి... పంట తుపాను బారిన పడి నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చంటాడు ఈ రైతు. అవును మరి, కావేరీ డెల్టా ప్రాంతాలను గడగడలాడించిన 'గజ' తుపాను సమయంలో 72 గంటలపాటు ఈ పద్ధతి పాటించే పంటను రక్షించుకున్నాడు.

"సైఫన్​ మెథడ్​ గురించి గూగుల్​లో వెతికితే తెలుస్తుంది. ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఆ నీటిని భూగర్భంలోకి పంపొచ్చు. అలా చేస్తే వర్షాలు లేనప్పుడు ధైర్యంగా వ్యవసాయం చేసుకోవచ్చు. ఇది వ్యవసాయానికి మాత్రమే కాదు, చెన్నై వంటి నగరాల్లో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చక్కటి పరిష్కారం. ఈ పద్ధతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను"

- బాలకృష్ణన్​, రైతు.

రైతులంతా వర్షాలు బాగా పడ్డప్పుడు నీటిని భూగర్భంలోకి పంపితే కరువు పరిస్థితుల్లో నీటికోసం ఎదురు చూసే పరిస్థితి రాదంటాడు కృష్ణన్​.

ఇదీ చూడండి: వైరల్​: తుపాకీలో తూటాలు ఇలా నింపాలిరా చిన్నా

ABOUT THE AUTHOR

...view details