వీలైనంత త్వరగా భారత్- చైనాలు వాస్తవాధీన రేఖను స్పష్టంగా గుర్తించుకోవాలని భారత మాజీ దౌత్యవేత్త అశోక్ కాంతా సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. సరిహద్దును త్వరగా గుర్తించనంత వరకు గాల్వన్ లోయ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణ చర్యలను కొనసాగించాలని కోరారు అశోక్. వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య చర్చలు జరగకపోవచ్చని... అయితే అత్యున్నత సైనిక, దౌత్యపరమైన స్థాయిలో చర్చలు కొనసాగించాలన్నారు.
వేరే చోట్లా ఘర్షణలకు అవకాశం!
వాస్తవాధీన రేఖ వెంబడి ఇతర ప్రాంతాల్లోనూ ఘర్షణలు తలెత్తే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు అశోక్. అయితే ఘర్షణలు ఉద్రిక్తతలుగా మారకుండా ఇరుదేశాలు జాగ్రత్తపడాలని సూచించారు. భారత్కు వ్యతిరేకంగా తన పరపతిని ఉపయోగించాలని చైనా ఉద్దేశపూర్వకంగా భావిస్తోంది కాబట్టే.. 18 సంవత్సరాల నుంచి సరిహద్దు సమస్య పరిష్కారాన్ని వాయిదా వేస్తూ వస్తోందని అన్నారు. ఇది భారత్కు ఓ మేల్కొలుపు కావాలని... ఈ చర్చలను వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు.
ఈటీవీ భారత్ ప్రతినిధితో మాజీ దౌత్యవేత్త అశోక్ కాంతా "కొన్నేళ్లుగా సరిహద్దులో శాంతి కొనసాగించడానికి భారత్- చైనాలు చాలావరకు ప్రయత్నించాయి. సైన్యానికి విశ్వాసం పెంచే చర్యలు చేపట్టాయి. అయితే ఇవేవీ ప్రయోజనం చేకూర్చలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. సరిహద్దులో ఏప్రిల్ కన్నా ముందు ఉన్న పరిస్థితులను కొనసాగేలా చేయాలి."
-అశోక్ కాంతా, మాజీ దౌత్యవేత్త
ఈ ఉద్రిక్తతలు స్థానికంగా ప్రణాళిక రచించి అమలుచేసినవి కాదని స్పష్టం చేశారు అశోక్. మే 5 నుంచి చాలా ప్రాంతాల్లో చైనా సైన్యం చొరబాట్లకు పాల్పడిందన్నారు. చైనా నాయకత్వ ఆదేశాలు లేకుండానే ఇవి జరగకపోవచ్చని పేర్కొన్నారు. కానీ, దీనర్థం సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు చైనా వ్యతిరేకమని కాదని అభిప్రాయపడ్డారు.
ఈటీవీ భారత్ ప్రతినిధితో మాజీ దౌత్యవేత్త అశోక్ కాంతా ఒప్పందాలకు కట్టుబడాలి
సరిహద్దులో యథాతథ స్థితిని తిరిగి నెలకొల్పడం చాలా అవసరమన్నారు అశోక్ కాంతా. అదేసమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ నిర్వహించే భారత జవాన్లకు చైనా సైన్యం ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని స్పష్టం చేశారు. భారత్ తన భూభాగంలో చేపట్టే మౌలిక సదుపాయాల నిర్మాణంపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న మార్గదర్శకాలు, సరిహద్దు ఒడంబడికలు బాగానే ఉన్నప్పటికీ.. వాటిని ఇరుదేశాలు సమర్థంగా అమలు చేయలేకపోతున్నాయని అన్నారు. రెండు దేశాలు ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు.
ఈటీవీ భారత్ ప్రతినిధితో మాజీ దౌత్యవేత్త అశోక్ కాంతా "వాస్తవాధీన రేఖను నిర్ణయించుకున్నప్పుడు దానికి విఘాతం కలిగించకుండా ఇరుదేశాలు కట్టుబడి ఉంటాలి. కొన్ని వారాల నుంచి చైనా ఈ సరిహద్దును మార్చాలని చూస్తోంది. జూన్ 6న ఇరుదేశాల సైనికాధికారుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి భంగం కలిగించేలా.. గాల్వన్ లోయలో ఉద్రిక్తతలు తీవ్రం చేసింది."
-అశోక్ కాంతా, మాజీ దౌత్యవేత్త
రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల సారాంశంపై దేశాధినేతలు మాట్లాడకపోవడంపై స్పందించారు అశోక్. సున్నితమైన సమస్యలను మీడియా సమక్షంలో చర్చించరని... అయితే ఈ విషయంలో పారదర్శకత ఉండటం కూడా చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఊహాగానాలు వ్యాప్తి చెందకుండా అరికట్టాలని అన్నారు.