ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ నిషేధం దిశగా అడుగులేస్తోంది భారతీయ రైల్వే. ఇందుకోసం రైల్వేస్టేషన్ల పరిసరాలతో పాటు రైళ్లలోనూ పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి నడుం బిగించింది. గతేడాది అక్టోబరు 2 నుంచే వారణాసి రైల్వేస్టేషన్లో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను వాడొద్దని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేరింది. వాటికి బదులుగా మట్టిపాత్రలు వినియోగించాలని స్పష్టం చేసింది. ఫలితంగా వారణాసి రైల్వేస్టేషన్ పరిసరప్రాంతాల్లో కాఫీ, టీ, ఇతర ఆహారపదార్థాలను ప్లాస్టిక్‌కు బదులుగా మట్టిపాత్రల్లో విక్రయిస్తున్నారు. తద్వారా మట్టి కుండలు తయారుచేసే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
" దేశవ్యాప్తంగా చేపడుతున్న చర్యల మాదిరిగానే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ నిషేధానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే స్టేషన్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాం. అయితే బయటి నుంచి ప్రయాణికులు తెచ్చుకునే వాటిని మాత్రం అనుమతిస్తున్నాం. వాటిని కూడా త్వరలోనే నిషేధిస్తాం."
- ఆనంద్ మోహన్, స్టేషన్ డైరెక్టర్