వాతావరణ కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం కావాలనే నినాదంతో కూడిన ప్లకార్డును పట్టుకున్న ఈ చిన్నారి పేరు లిసీప్రియా కంగుజం. మణిపూర్ కు చెందిన ఈ బాలిక వయస్సు తొమ్మిదేళ్లు. అతిచిన్న వయస్సులోనే పర్యావరణ కార్యకర్తగా అవగాహన కార్యక్రమాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు ఇచ్చి ఔరా అనిపిస్తోంది ఈ చిన్నారి.
దిల్లీ ఉక్కిరి బిక్కిరి..
శీతాకాలం వచ్చిందంటే దిల్లీ సహా ఉత్తరభారతంలో కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతుండటం వల్ల నివారణకు చర్యలు చేపట్టాలంటూ పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ లో ధర్నాకు దిగింది లిసీప్రియా. ఈ నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు తన నిరసన తెలియజేసింది. దిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని.. నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
పర్యావరణ కాలుష్యాన్ని అంతమొందించేందుకు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలంటే వాతావరణ మార్పుల చట్టం తీసుకురావాలని చిన్నారి పర్యావరణ వేత్త లిసీప్రియా డిమాండ్ చేస్తోంది. ప్రజాప్రతినిధులు తన డిమాండ్‌కు స్పందించాలంటూ ఆదివారం మరోసారి పార్లమెంట్ సమీపంలో నిరసన తెలియజేసిన లిసీప్రియాను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టారు.
పార్లమెంట్లో వాతావరణ మార్పుల బిల్లును ఆమోదించే వరకు తన ఉద్యమం కొనసాగుతుందని తెలిపింది లిసీప్రియా. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వాతావరణ మార్పుల పేరుతో పాఠ్యాంశాన్ని బోధనాంశాల్లో చేర్చాలని.. తనలాంటి చిన్నారులు అమ్మలాంటి ప్రకృతిని కాపాడుకునేలా ప్రోత్సహించాలని కోరుతోంది.
క " పగటి పూట ఎంత చెప్పినా మన నాయకులు పట్టించుకోవటం లేదనే కారణంగానే రాత్రి ఇక్కడకి వచ్చి నిరసన చేస్తున్నా. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు నేతలు వెంటనే చర్యలు తీసుకోవాలి. దిల్లీనే తీసుకుంటే వాయుకాలుష్యం ఎంత ప్రమాదకరంగా మారిందో తెలుస్తుంది. దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుక్కోవటానికి బదులుగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటంలో మన నేతలు బిజీగా ఉన్నారు. మాటలు చెప్పటమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ప్రపంచ నేతలు సత్వరం చర్యలు తీసుకోకుంటే భూమండలం నాశనమవుతుంది."