తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పంజా: సిక్కింలో తొలిరూపం..'మహా'లో విశ్వరూపం

సిక్కిం రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. దిల్లీ నుంచి తిరిగొచ్చిన విద్యార్థికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో కేసుల సంఖ్య 47 వేలు దాటింది. తమిళనాడులో 759, కర్ణాటకలో 216 కొత్త పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

coronavirus
కరోనా వైరస్

By

Published : May 23, 2020, 11:10 PM IST

దేశం మొత్తం విధ్వంసం సృష్టిస్తున్న కరోనా వైరస్.. తాజాగా సిక్కిం రాష్ట్రానికి పాకింది. ఈ చిన్న రాష్ట్రంలో తొలి కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. దిల్లీ నుంచి తిరిగొచ్చిన 25 ఏళ్ల విద్యార్థి నమూనాలను సిలిగుడిలోని దక్షిణ బంగాల్ మెడికల్ కాలేజీకి పంపగా.. ఫలితం పాజిటివ్​గా తేలినట్లు తెలిపారు. విద్యార్థి ప్రస్తుతం గ్యాంగ్​టక్​లోని ఎస్​టీఎన్​ఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో వరుసగా ఏడో రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 2,608 కొత్త కేసులతో రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 47,190కి చేరింది. మరో 60 మంది వైరస్ ధాటికి బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,577కు ఎగబాకింది.

తమిళనాడులో 15 వేలకు..

తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 759 పాజిటివ్ కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. మరో 5 మరణాలతో రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 103కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 15,512కి ఎగబాకింది. మరో 363 మంది డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 7,491 మంది కోలుకున్నారు.

తొలి 'ద్విశతకం'

కర్ణాటకలో మరో 216 కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో రెండు వందలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. మహమ్మారి బాధితుల సంఖ్య 1,959కి చేరింది. కొత్త కేసుల్లో 187 మంది మహారాష్ట్ర నుంచి వచ్చిన వారేనని తెలిపారు. మరణాల సంఖ్య 42గా ఉన్నట్లు పేర్కొన్నారు.

కేరళలో మరో 62 మందికి కరోనా సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 794కు చేరింది. ప్రస్తుతం 275 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 91 వేల మందిని పరిశీలనలో ఉంచారు.

మధ్యప్రదేశ్​లో కొత్తగా 201 మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 6,371కి చేరగా.. మృతుల సంఖ్య 281కి పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details