ఈశాన్య రాష్ట్రం సిక్కిం... ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు సిక్కిం. హిమాలయ సొగసులు, బౌద్ధాశ్రమాలతో ఎటుచూసినా ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణే. జనాభా పరంగానూ చిన్న రాష్ట్రం.
సిక్కిం మరో ప్రత్యేకత... అక్కడి రాజకీయ పరిస్థితి. ఆ రాష్ట్రంలో 1994 నుంచి ఒక పార్టీదే అధికారం. అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఒక్కరే. ఇప్పుడు మరోమారు ఎన్నికలు వచ్చాయి. సిక్కిం ఓటరుగణం మరోమారు అదే పార్టీకి జైకొడుతుందా లేక మార్పు కోరుకుంటుందా అన్నది ఆసక్తికరం.
ఇదీ చూడండి:కాషాయదళ 'కాకీ ఎన్నికల' వ్యూహం!
పోలింగ్ తేదీ | ఏప్రిల్ 11 |
లోక్‌సభ స్థానాలు | 1 |
అసెంబ్లీ స్థానాలు | 32 |
ఓటర్లు | 4, 23, 325 |
అధికార పక్షం | సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ |
ప్రధాన ప్రత్యర్థి | సిక్కిం క్రాంతికారి మోర్చా |
సిక్స్ కొడతారా..?
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించిన పవన్ చామ్లింగ్పైనే అందరి దృష్టి. ఆరోసారి విజయం కోసం ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన రికార్డుకు ఇప్పట్లో ఎదురే ఉండదు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా జ్యోతి బసు రికార్డును అధిగమించారు చామ్లింగ్.
- 1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు పవన్ చామ్లింగ్. రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా చేశారు. 1993 మార్చి 4న సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ స్థాపించారు.
- 1994 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు చామ్లింగ్. అనంతరం వరుసగా 1999, 2004, 2009, 2014లోనూ అదే పునరావృతం చేశారు.
- వరుసగా 5 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా రికార్డు సృష్టించారు. అంతకుముందు జ్యోతి బసు బంగాల్‌కు ఐదుసార్లు వరుసగా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
- రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే పేరుంది. శాంతి స్వభావులుగా ప్రజలు భావిస్తారు.
- గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలకు గాను ఎస్డీఎఫ్ 22 గెల్చుకుంది. సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) 10 స్థానాలు దక్కించుకుంది.
- 2014లో రాష్ట్రంలోని ఒక లోక్‌సభ స్థానాన్నీ ఎస్డీఎఫ్ కైవసం చేసుకుంది.
ఎస్‌కేఎం పుంజుకునేనా...?
2014లో 10 శాసనసభ స్థానాలు గెలుచుకుంది సిక్కిం క్రాంతికారి మోర్చా. ఇప్పుడా పార్టీకి మిగిలింది ఇద్దరు సభ్యులే. ఏడుగురు ఎమ్మెల్యేలు 2015లో అధికార ఎస్‌డీఎఫ్‌లో చేరారు. అవినీతి కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారై... పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమంగ్‌పై అనర్హత వేటు పడింది. ఫలితంగా పార్టీ కుదేలైంది.
2019 ఎన్నికల్లో సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఎస్‌కేఎం. భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు తొలుత మొగ్గుచూపినా... ఆఖరి క్షణంలో మనసు మార్చుకుంది.