తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2020, 7:36 PM IST

ETV Bharat / bharat

'ఆక్స్​ఫర్డ్​ టీకా ప్రయోగాలకు ఇక్కడ బ్రేక్​ పడదు'

ఆక్స్​ఫర్డ్​ టీకా ట్రయల్స్​కు బ్రిటన్​లో బ్రేక్​ పడినప్పటికీ.. అది భారత్​లో జరుగుతున్న ప్రయోగాలపై ఎలాంటి ప్రభావం చూపించదని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా స్పష్టం చేశారు. తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న టీకా ఉత్పత్తి తాము నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

SII ceo clarifies about Oxford vaccine trails in India
'ఆక్స్​ఫర్డ్​ టీకా ప్రయోగాలకు ఇక్కడ బ్రేక్​ పడదు'

కరోనా వ్యాక్సిన్‌ బరిలో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా టీకా ప్రయోగాలకు యూకేలో తాత్కాలికంగా బ్రేక్ ‌పడటంపై పుణెలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) స్పందించింది. యూకేలో జరిగిన ఆ ఘటన ప్రభావం.. ఇక్కడ తమ సంస్థ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి చేస్తున్న ప్రయోగాలపై ఉండదని స్పష్టం చేసింది. భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ యథాతథంగానే కొనసాగుతాయని ఎస్‌ఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా తెలిపారు. టీకా ప్రయోగాల్లో ఇప్పటి వరకు అవాంఛనీయ ఘటనలేవీ నమోదు కాలేదని పేర్కొన్నారు. తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న టీకా ఉత్పత్తి తాము నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఎస్‌ఐఐ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా టీకా మూడో దశ ప్రయోగాల సందర్భంగా బ్రిటన్‌లో ఓ వలంటీర్‌ అనారోగ్యానికి గురికావడం వల్ల ప్రస్తుతానికి ట్రయల్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ వలంటీర్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయనేది మాత్రం ఆస్ట్రాజెనికా వెల్లడించలేదు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇలాంటి సమస్యలు సాధారణమేనని, ఇంత భారీ సంఖ్యలో ట్రయల్స్‌ నిర్వహించినప్పుడు ఇలా జరుగుతుంటాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఇలా జరిగినప్పుడు లోతైన పరిశీలన చేసి తిరిగి ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పారు.

ప్రస్తుతం ఆస్ట్రాజెనికా టీకాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయి.

ఇదీ చూడండి:-'రష్యా 'స్పుత్నిక్-వీ'​ ప్రతిపాదనకు అధిక ప్రాధాన్యం '

ABOUT THE AUTHOR

...view details