మానవ జీవితాలను చిన్నాభిన్నం చేసే ఉగ్రవాదం.. సరిహద్దులను దాటి దక్షిణ భారతానికి పాకింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 నుంచి 200 మంది ఉగ్రవాదులతో ఓ ప్రత్యేకమైన ప్రాంతాన్నే ఐసిస్ ఏర్పాటు చేసింది. ఇందుకేసం కేరళ, కర్ణాటకలను ఐసిస్ ఉగ్రవాదులు ఎంచుకున్నారని.. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని ఐరాస నివేదిక హెచ్చరించింది. ఇందులోని సభ్యులంతా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందినవారేనని తెలుస్తోంది. ఈ కొత్త బృందం భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్ఫష్టం చేసింది.
అనలిటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్ టీమ్ (ఏఎస్ఎస్ఎమ్టీ) 26వ నివేదికలో.. ఐసిస్, అల్‌ఖైదా, వాటి కోసం పనిచేస్తున్న వ్యక్తుల గురించి వెల్లడించింది ఐరాస. అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్, కాందహార్, నిమ్రుజ్ రాష్ట్రాల్లోనితాలిబన్ వర్గాల అధీనంలో.. భారత ఉపఖండంలోని అల్‌ఖైదా(ఏక్యూఐఎస్) పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏక్యూఐస్ లీడర్ ఆసీం ఉమర్ చనిపోయాక ఆ బాధ్యతలను చేపట్టిన ఒసామా మహమ్మూద్... ఆసీం మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది.