జమ్ముకశ్మీర్ ఇవాళ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. అయినప్పటికీ కశ్మీర్ వ్యాప్తంగా ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. చాలా ప్రాంతాల్లో వ్యాపార దుకాణాలు ఇప్పటికీ మూసి ఉన్నాయని.. పలు ప్రాంతాల్లో మాత్రం కార్లు, ఆటోలు, రిక్షాలు రోడ్లపై తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
కశ్మీర్ పునర్విభజనకు వ్యతిరేకంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శలు గుప్పించింది.
"కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించటం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం జమ్ముకశ్మీర్‌ను విభజించే అధికారం పార్లమెంటుకు లేదు. కావాలంటే రాష్ట్రంలోని కొత్త భూభాగంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికే పార్లమెంట్‌కు అధికారం ఉంది. అంతేకానీ.. రాష్ట్రాన్నే రూపుమాపే అధికారం లేదు."
- హస్నైన్ మసూది, ఎన్‌సీ నాయకుడు.