తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​పై పాక్​ కొత్త కుట్రలు- తాలిబన్ల సాయంతో... - ఆర్టికల్​ 370 రద్దు

కరోనా కేసుల లెక్కలు, అడపాదడపా ఎన్​కౌంటర్లు... జమ్ముకశ్మీర్​ నుంచి ఇటీవల వస్తున్న వార్తలివే. కానీ... కశ్మీర్​లో హింసను రాజేసేందుకు తెర వెనుక భారీ కుట్రలు జరుగుతున్నాయన్నది నిపుణుల మాట. శక్తిమంతమైన తాలిబన్ల వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పించి మరీ ఉగ్రవాదుల్ని ఉసిగొల్పేందుకు పాకిస్థాన్ యత్నిస్తోందన్నది వారి విశ్లేషణ. అంతర్గతంగానూ 'నయా ఉగ్రవాదం' వేళ్లూనుకుంటోందని హెచ్చరిస్తున్నాయి నిఘావర్గాలు. ఇంతకీ కశ్మీర్​లో ఏం జరగనుంది? ఈ సవాళ్లను భారత సైన్యం ఎలా ఎదుర్కొటుంది?

Showdown under the Chinar- Torrid times just ahead in Kashmir
భారత్​ ముంగిట ముప్పు

By

Published : Apr 24, 2020, 7:08 PM IST

ప్రార్థనలు, ఉపవాసాలతో భక్తి శ్రద్ధలు కనబరుస్తూ.. పవిత్ర రంజాన్​ మాసాన్ని గడుపుతారు ముస్లింలు. ఇలాంటి పర్వదినాల్లో కశ్మీర్ ​లోయలో అల్లర్లు జరిగే అవకాశాలున్నాయా? పాక్​ కుయుక్తుల్ని తిప్పికొడుతూ భారత్ చేసిన​ లక్షిత దాడులకు బదులు తీర్చుకోవడానికి కరోనా కాలమే సరైనదని పొరుగు దేశం భావిస్తోందా? కష్టకాలంతో భారత్​ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందా? అంటే అవును అంటున్నారు విశ్లేషకులు. ప్రత్యర్థి ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలున్నాయని ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అంచనా వేస్తున్నారు. అందుకు తాలిబన్ల సహకారం ఉండడం మరింత ఆందోళనకర విషయమని విశ్లేషిస్తున్నారు.

తాలిబన్ల ప్రత్యేక శిక్షణ..

ఏప్రిల్​ 13... అఫ్గానిస్థాన్​కు చెందిన నేషనల్​ డైరెక్టరేట్​ ఆఫ్​ సెక్యూరిటీ(ఎన్​డీఎస్​) కమాండోలు.. పాకిస్థాన్​కు సరిహద్దులో ఉన్న నన్​గాడర్​ జిల్లాలోని మోమంద్​ దరా ప్రాంతంలో తాలిబన్ల స్థావరాలపై దాడి చేశారు. ఇందులో దాదాపు 15 మంది ముష్కరులు హతమయ్యారు. వారిలో ఐదుగురు మాత్రమే అఫ్గాన్​కు చెందిన వారు. మిగిలిన పది మంది పాకిస్థాన్​ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్​(జేఈఎమ్​) ఉగ్రవాదులే. అక్కడ పట్టుబడిన ఓ ఉగ్రవాది అసలు విషయం బయటపెట్టాడు. కశ్మీర్​లో దాడులు చేసేందుకు జైష్​ ఉగ్రవాదులకు తాలిబన్​ సంస్థ శిక్షణ ఇస్తోందని వెల్లడించాడు.

కశ్మీర్​లో దాడుల కోసం జైషే మహ్మద్ ముష్కరులకు తాలిబన్లు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. నియంత్రణ రేఖను, పర్వత ప్రాంతాలను దాటి భారత్​లోకి ఎలా చేరుకోవాలి? అనే అంశాలపై వారికి తర్ఫీదు ఇస్తున్నట్లు నన్​గాడర్​​ శిక్షణా శిబిరంపై దాడి తర్వాత సమాచారం విశ్లేషించడం ద్వారా అర్థమైంది.

దాదాపు 60 వేల మంది ముష్కరులతో అఫ్గానిస్థాన్​లో అత్యంత శక్తిమంతమైన ఉగ్రసంస్థగా ఉంది తాలిబన్. అంతటి కీలకమైన సంస్థ ఇప్పుడు బాహాటంగానే కశ్మీర్​కు వ్యతిరేకంగా పనిచేసే పాకిస్థానీ ముష్కర మూకలకు మద్దతు ఇవ్వడం భారత భద్రతా బలగాలను కలవరపరిచే అంశం.

ప్రత్యేకంగా క్యాంప్​...

ఇస్లామిక్​ స్టేట్​, అల్​ఖైదా, మరికొన్ని గ్రూపులు కలిసి బదక్షన్​ రాష్ట్రం జుర్మ్​ జిల్లాలోని దరా-ఎ-కుత్సక్​ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని కొన్ని అఫ్గాన్​ మీడియా సంస్థలు వెల్లడించాయి. అఫ్గాన్​ ఈశాన్య ప్రాంతంలో ఉన్న బదక్షన్​ రాష్ట్రం... ఎప్పటినుంచో ముష్కరులకు కంచుకోట. పాకిస్థాన్​, తజకిస్థాన్​, చైనా సరిహద్దును పంచుకుంటున్న ఈ ప్రాంతం.. పాక్​ ఆక్రమిత కశ్మీర్​కు దగ్గరగానే ఉంది.

ఇప్పటికే అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు బలమైన శక్తిగా ఎదిగారు. వాళ్లకు పాకిస్థాన్ రహస్య సంస్థ ఐఎస్​ఐతో సత్సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా పాకిస్థాన్​కు పశ్చిమ ప్రాంతంలో పెద్దగా ఇబ్బందులు లేవు. అందుకే తూర్పున ఉన్న భారత్​పైనే ఎక్కువగా దృష్టిపెడుతోంది ఆ దేశం. ఐఎస్​ఐ ఉద్దేశం కూడా భారత్​కు విరుద్ధంగా పనిచేయడమే కాబట్టి... ఆయా ముష్కర మూకలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తోంది.

అంతర్గతంగానూ సవాళ్లే...

గత ఏడాది అక్టోబర్​ నుంచి కశ్మీర్​ లోయలో వరుసగా గ్రెనేడ్ దాడులు జరుగుతున్నాయి. అన్నింటిలోనూ పోలీసులు, పారామిలటరీ సిబ్బందే లక్ష్యం. కొత్తగా ఏర్పడిన 'ద రెసిస్టెన్స్​ ఫ్రంట్​(టీఆర్​ఎఫ్​)' ఈ దాడులు అన్నింటికీ బాధ్యత ప్రకటించుకోవడం మరో కీలకాంశం.

ఏప్రిల్​ 5న.. నియంత్రణ రేఖ సమీపంలోని కేరన్ సెక్టార్​ వద్ద ప్రత్యేక దళాలు.. ఐదుగురు టీఆర్​ఎఫ్​ మిలిటెంట్లను మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు భారత జవాన్లు వీరమరణం పొందారు. ఇంత హోరాహోరీగా జరిగిన ఈ ఎన్​కౌంటర్​... భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగించేందుకు టీఆర్ఎఫ్​ ముష్కరులు ఏ స్థాయిలో శిక్షణ పొందుతున్నారో తెలియజేస్తోంది.

అసలు టీఆర్​ఎఫ్​ ఎందుకొచ్చింది?

హిజ్బుల్ ముజాహిద్దీన్​, జైషే మహ్మద్, లష్కరే తొయిబా... కశ్మీర్​లో కీలకమైన ఉగ్రమూకలు. సైన్యం దూకుడుతో హిజ్బుల్ ప్రభావం తగ్గింది. జైషే మహ్మద్, లష్కరే తొయిబాపై విదేశీ శక్తుల ప్రభావం ఎక్కువ. అందుకే 'పక్కా లోకల్​' స్కెచ్​తో పనిచేస్తోంది టీఆర్​ఎఫ్​. 2019 అక్టోబర్​లో సంస్థ ఆవిర్భవించిన నాటి నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా స్థానికుల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది.

2019, ఆగస్టు 5న.. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి అధికారమిచ్చే ఆర్టికల్​ 370 రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఫలితంగా జమ్ముకశ్మీర్ రాష్ట్రం​.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారి కేంద్రం చేతుల్లోకి వచ్చింది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. అశాంతి నెలకొల్పేందుకు యత్నిస్తోంది టీఆర్​ఎఫ్​. ఇప్పటికే ఆ సంస్థ క్షేత్రస్థాయి కార్యకర్తలు, సానుభూతిపరులు, వారి మద్దతుదారులు మిలిటెంట్ల ఉద్యమానికి భాగస్వామ్యం వహిస్తున్నారు. భారత దేశ ప్రత్యర్థులకు తోడ్పాటు అందిస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్​లో స్థానిక నాయకత్వం విషయంలోనూ పెను మార్పులు జరిగాయి. ప్రజలు తమ ఆక్రోశాన్ని, కష్టసుఖాలను చెప్పుకునేందుకు ఎవరూ కనిపించని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంక్లిష్టతలను తనకు అనువుగా మార్చుకుని, ప్రజల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తోంది టీఆర్ఎఫ్​.

సవాళ్ల సమయం...

ఆర్టిక్​ 370 రద్దయ్యాక వచ్చిన తొలి వేసవి, రంజాన్​ మాసం ఇదే. ప్రస్తుతం దేశం కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ మహమ్మారిపై పోరులో భారత ఆర్మీ సహా భద్రతా దళాలు పాలుపంచుకుంటున్నాయి. ఇలాంటి సమయాన్ని పాకిస్థాన్​ సహకారంతో ఉగ్రవాద సంస్థలు వినియోగించుకొని.. భారత్​ను దెబ్బతీయాలని చూస్తున్నాయి.

భారత ప్రభుత్వం కశ్మీర్​కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఇప్పటివరకు ఎదురులేకుండా నిర్ణయాలు తీసుకుంది. ఇలాంటి సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా పెద్ద వైఫల్యంగా పరిగణించాల్సి ఉంటుంది. కారణాలు, సాకులు చెప్పే పరిస్థితి ఉండదు. అందుకే భద్రతా బలగాలకు కశ్మీర్​ సమస్య పెను సవాలుగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉగ్రమూకల్ని కూకటివేళ్లతో పెకలించడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఇదే అనివార్యమైతే... కశ్మీరీల హృదయాల్ని గెలుచుకోవాలన్న ప్రయత్నాలు మరింత ఆలస్యం కావడం ఖాయం.

ఇప్పటికే సంకేతాలు?

కశ్మీర్​లో ఏదో జరగబోతోందనేలా ఇప్పటికే వెలువడుతున్న సంకేతాలు అధికార యంత్రాగానికి గుబులు పుట్టిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, నివాస హక్కుల్లో మార్పులు వంటి విషయాల్లో పౌర సమాజం సహా దాదాపు అన్ని వర్గాలు మౌనంగానే ఉన్నాయి. ఆ మౌనం వెనుక ఆంతర్యం ఏంటన్నది అసలు ప్రశ్న. ఇటీవల ఎన్​కౌంటర్ల సంఖ్య పెరగడం మరో ఆందోళనకరాంశం. ఇవన్నీ చూస్తుంటే... కశ్మీర్​లో మరోమారు హింసకు రంగం సిద్ధమవుతోందని అర్థమవుతోంది. ఈ సవాలను భారత ప్రభుత్వం, భద్రతా విభాగాలు ఎలా ఎదుర్కొంటాయన్నదే అసలు ప్రశ్న.

(రచయిత- సంజీవ్ బారువా, సీనియర్ పాత్రికేయుడు)

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details