పులులను హింసించారు-ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సఫారీ పార్క్ సిబ్బంది పులులను హింసిస్తూ చిత్రీకరించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నయా రాయ్‌పుర్‌లో ఉన్న జంగిల్ సఫారీ పార్క్‌లో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి పులులను హింసించినందుకు ముగ్గురు సిబ్బందిని ఉద్యోగం నుంచి తప్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది..
ఇటీవలే ఓ టూరిస్టు బస్సు సఫారీ పార్క్‌లో తిరుగుతున్న సమయంలో.. ఆ వాహనం కిటికీ నుంచి ఓ గుడ్డముక్క బయటకు వేళాడింది. దాన్ని చూసిన ఓ పులి ఆ గుడ్డను నోటితో పట్టుకునేందుకు ప్రయత్నించింది. వాహనంలో ఉన్న సిబ్బంది ఆ పులిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. వారిని ఆపాల్సిన గైడ్.. ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించాడు.
అదే సమయంలో మరో పులి అక్కడకు వచ్చింది. వాహనంలో ఉన్న వారు అరుస్తుండటం వల్ల ఆ పులులకు ఏం జరుగుతుందో ఆర్థం కాలేదు. ఫలితంగా ఒక దానిపై ఒకటి దాడికి దిగాయి. అనంతరం ఓ పులి కొద్ది సేపు బస్సు వెనకాలే పరిగెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. బస్సులో ఉన్న ఇద్దరు గైడ్లు సహా డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించింది.
ఇదీ చూడండి:ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్