మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసినప్పటికీ.. తమ హిందుత్వ అజెండాను వదిలిపెట్టబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. హిందుత్వ భావజాలం తమ పార్టీకి ఎంతో అవసరమని.. వాటిని శివసేన ఎప్పటికీ వదులుకోదని ఆ రాష్ట్ర విధానసభలో వ్యాఖ్యానించారు.
"నేను ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను. ఎప్పటికీ హిందుత్వ అజెండాను విడిచి పెట్టను."-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.
భాజపా శాసనసభాపక్ష నేతగా ఫడణవీస్ ఎన్నిక కావడంపై ఠాక్రే హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్లు స్నేహితుల్లా కలిసి ఉన్నామని గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి తాను ఎన్నడూ నమ్మకద్రోహం చేయలేదన్నారు.
"గతంలో నన్ను విమర్శించిన వారు ఇప్పుడు నాతో ఉన్నారు. గతంలో నాతో ఉన్నవారు ఇప్పుడు నాకు ప్రత్యర్థులుగా మారారు. నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ వచ్చాను. ముఖ్యమంత్రి కావడం మాత్రం నా అదృష్టం."-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.