తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చైనాతో ఆరోగ్యకర సంబంధాలు అవసరం' - మాజీ భద్రతా సలహాదారు శివశంకర్​ మేనన్​

ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో సంబంధాలను స్థిరంగా కొనసాగించి లబ్ధి పొందాలని జాతీయ మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మేనన్ అభిప్రాయపడ్డారు. పరస్పర ప్రయోజనాల కోసం ఆరోగ్యకర వాతావరణం అవసరమని విశ్లేషించారు. సీనియర్ పాత్రికేయురాలు స్మితా శర్మతో ముఖాముఖిలో పలు అంశాలపై స్పందించారు మేనన్.

‘చైనాతో ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరం’

By

Published : Oct 16, 2019, 2:49 PM IST

Updated : Oct 16, 2019, 4:04 PM IST

ఎవరికి వారు అన్నట్లుగా కాకుండా చైనాతో ఆరోగ్యకరమైన సంబంధాలు నెరిపి ఫలితాలు సాధించడంపై భారత్ దృష్టి సారించాలని జాతీయ మాజీ భద్రతా సలహాదారు శివ శంకర్ మేనన్ అభిప్రాయపడ్డారు. సీనియర్ పాత్రికేయురాలు స్మితా శర్మతో ముఖాముఖిలో భారత విదేశాంగ విధానంపై ఆయన మాట్లాడారు.

చెన్నై వేదికగా భారత్-చైనా దేశాధినేతల మధ్య జరిగిన రెండో అనధికారిక భేటీ ఇరు దేశాలకు కీలకమని మేనన్ అన్నారు. హాంకాంగ్, తైవాన్, అమెరికాతో ఇబ్బందులు పడుతున్న చైనా.. కశ్మీర్ సమస్యపై పాక్​కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో భారత్​- డ్రాగన్​ దేశం మధ్య సంబంధాల పునరుద్ధరణ అవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికల్లో ఉగ్రవాదంపై పాక్​ను భారత్​ ఎండగడుతునప్పటికీ.. ఆర్థిక వృద్ధిపై మోదీ ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. 2008 ముంబయి ఉగ్రదాడి అప్పటి ఎన్నికల్లో ప్రచారాస్త్రం కాలేదన్నారు మేనన్.

చైనాలో భారత రాయబారిగా పనిచేసిన ఆయన.. బీఆర్ఐ(బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్)ను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే వాణిజ్యానికి సంబంధించి మాత్రమే బీఆర్ఐను వినియోగించుకోవాలని సూచించారు. రీసెప్​లో చేరికను ప్రస్తావించిన మేనన్.. ఒకటి రెండు పరిశ్రమలు విదేశీ వాణిజ్య విధానాన్ని శాసించకూడదని అన్నారు.

పాక్ అణు హెచ్చరికల విషయంపై ప్రశ్నించగా.. ఉపఖండంలో అణు ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేదన్నారు. ఇక అణ్వాయుధాలను మొదట ప్రయోగించవద్దనే అంశంపై హేతుబద్ధమైన సమీక్ష అవసరమని అభిప్రాయపడ్డారు. మేనన్​తో పూర్తి స్థాయి ముఖాముఖి మీకోసం..

ప్రశ్న: భారత్​-చైనా రెండో అనధికారిక శిఖరాగ్ర సదస్సును మీరు ఎలా చూస్తున్నారు?

మేనన్​: కొన్ని రోజులుగా వివిధ కారణాలతో నెమ్మదిస్తున్న సంబంధాలను తిరిగి గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సదస్సు జరిగింది. పాకిస్థాన్​కు డ్రాగన్​ మద్దతు కొనసాగించడం, ఆర్టికల్​ 370 రద్దుపై చైనా స్పందన, ఆ విషయాన్ని ఐరాస భద్రతా మండలిలో లేవనెత్తడం.. ఇలాంటి విభేదాలు ఎన్నో ఉన్నాయి. ప్రాథమికంగా చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగానే ఉన్నట్లు చూపించేందుకు భారత్​-చైనా ప్రయత్నించాయి. ఆ తర్వాతే మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మనకు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఇతర అంశాలు సంక్షోభం వైపు సాగుతున్నాయి. చైనాలో ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. మామల్లపురం సదస్సులో అమెరికా రుద్దుతున్న పన్నుల భారం ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఇలా ఈ సదస్సు ఉమ్మడి ప్రయోజనాల కోసం జరిగిందే. ఏ కారణాలతో వుహాన్​ భేటీ విజయవంతమైందని మనం మాట్లాడుకుంటున్నామో.. మామల్లపురంలోనూ అదే స్ఫూర్తి కనిపిస్తుంది. అయితే పరస్పర ప్రయోజనాల దృష్ట్యా కొద్దిమేర ప్రభావం తగ్గినట్లు అనిపిస్తుంది. మామల్లపురం సదస్సు తీర్మానాలు, ప్రకటనలు, ఫలితాల ప్రకారం చూస్తే వుహాన్​ను మించినదేమీ కాదు.

ఈ భేటీలో వాణిజ్య లోటు అంశాలపై చర్చించేందుకు ఉన్నతస్థాయి యంత్రాంగం ఏర్పాటు కొంత ఆసక్తి కలిగిస్తోంది. ఈ ప్రక్రియతో రెండు దేశాల సంబంధాలు ఏ మేరకు మెరుగుపడతాయో చూడాలి. నాకు తెలిసి కాలక్రమేణా బలపడిన ఆర్థిక సంబంధాలకు రెండు దేశాలు సముచిత స్థానం కల్పిస్తాయని అనుకుంటున్నాను. మిగతా అంశాలను చూస్తే రెండు దేశాల మధ్య విభేదాలకు రాజకీయ కారణాలు చాలా తక్కువ. మొన్నటి భేటీలో జమ్ము కశ్మీర్​ అంశం చర్చకు రాలేదని విదేశాంగ కార్యదర్శి చెప్పారు. నమ్మడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఆ విషయం అధికారికంగా మాత్రమే చర్చకు రాలేదని భావిస్తున్నా.

ప్రశ్న: చైనాలో ఇమ్రాన్​ఖాన్​ పర్యటన విషయమై జిన్​పింగ్​ చర్చించినట్లు విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. కశ్మీర్​ ప్రస్తావన లేకుండానే ఈ విషయాన్నిచర్చించారని భావిస్తున్నారా?

మేనన్​: వ్యక్తిగత సంభాషణలో ఏం జరిగిందో మనకు తెలియదు. దేశాధినేతలు ఇద్దరు అనువాదకుల​ ద్వారా చాలా సేపు మాట్లాడుకున్నారు. పూర్తి వివరాలు తెలిసే వరకు ఈ విషయంపై మాట్లాడటం కష్టమే. కానీ దీనిపై వాళ్లు మాట్లాడి ఉంటే ఉపయోగకరంగా ఉండేది. ఎందుకంటే వాళ్లు సంబంధాల పునరుద్ధరణే కోరుకుంటున్నారు. మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే చైనాలో ఒక సామెత ఉంది.. 'మాటలను విను.. ప్రవర్తనను గమనించు.' భారత్​-చైనా మధ్య సంబంధాలకు ఇది చక్కగా సరిపోతుంది.

ప్రశ్న: మామల్లపురం భేటీకి ఎందుకు తక్కువ గ్రేడింగ్​ ఇస్తున్నారు? చెన్నై కన్నా వుహాన్​ సదస్సే స్ఫూర్తినిచ్చిందా?

మేనన్​: ప్రాథమిక కారణం.. రెండు దేశాల మధ్య స్థాయి అంతరం ఉండేది. రెండోది.. వుహాన్​ భేటీ తర్వాత నుంచి పాకిస్థాన్​తో సంబంధాలు దారుణంగా క్షీణించాయి. జమ్ము కశ్మీర్​పై పాకిస్థాన్​తో మన వాదనలను గమనిస్తే.. ఆ విషయాన్ని పాక్​ అంతర్జాతీయ అంశం చేయాలని ప్రయత్నించింది. నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలు, సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఇవన్నీ క్రమంగా ప్రస్తుత ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా మారాయి. ప్రస్తుతం మిగిలిన ప్రపంచం ఎదుట ఉగ్రవాద బాధిత దేశంగా భారత్ ఘోషిస్తోంది. ఈ విషయంలో మిగతా దేశాలు మనల్ని తేలికగా తీసుకుంటాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో మన పెత్తనానికి అడ్డుగోడగా నిలుస్తుంది.

ప్రశ్న: ఐరాస సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్​ పేరును ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. అంతకుమించి సమస్యల మీద భారత్​ దృష్టి సారించిందా?

మేనన్​: ఉగ్రవాదానికి పర్యాయపదం పాకిస్థాన్. ఆ దేశ​ అంతర్గత రాజకీయాల్లో ఈ అంశం ఎక్కువగా పనిచేస్తుంది. అంతర్గత రాజకీయాలు, విదేశాంగ విధానం రెండు వైవిధ్యమైన అంశాలు. ఆయా సమస్యల పరిష్కార మార్గాలూ భిన్నంగా ఉంటాయి.

ప్రశ్న: అంతర్జాతీయ వేదికలో ఉగ్రవాదంపైనే భారత్​ దృష్టంతా కేంద్రీకరించింది. భారత్​కు అతిముఖ్యమైన సవాల్ ఉగ్రవాదమేనా?

మేనన్​: ఇది నిజంగా ప్రధానమైన సవాల్. ప్రస్తుతం చొరబాట్లు, ఉగ్రవాద ఘటనలు గతం కన్నా ఘనంగా నియంత్రించటంలో విజయం సాధించారు. వాజ్​పేయీ ప్రభుత్వం నుంచి 2 దశాబ్దాలుగా ఈ సమస్య పరిష్కారానికి స్థిరంగా బలమైన అడుగులు వేస్తున్నాం. ప్రజల జీవనాధారం, సంక్షేమం తదితరాలన్ని ఆర్థికాంశాలు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (రీసెప్​)లో చేరడం లాంటి భారీ నిర్ణయాలను ఎలాంటి అవసరాల నేపథ్యంలో తీసుకుంటామనేది ముఖ్యం. అవే భవిష్యత్తులో ఉగ్రవాద రహిత మార్గాన్ని నిర్దేశిస్తాయి. కానీ దీని ప్రభావంతో ఏం జరుగుతుందో.. ఎంతమంది చనిపోతారన్నది చిన్న విషయంలా కనిపిస్తుంది. అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాద బాధితులమని చెప్పడం వల్ల ఎలాంటి అపప్రద ఉంటుందో నాకు కచ్చితంగా తెలియదు.

ప్రశ్న: మీడియా కవరేజీ తగ్గితే ఉగ్రవాదానికి ప్రాణవాయువు అందదని తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ వ్యాఖ్యానించారు. అప్పుడు ఉగ్రవాదాన్ని అంతర్గత సమస్యగా చిత్రీకరిస్తున్న ప్రభుత్వానికీ ఇది వర్తిస్తుందా?

మేనన్​: ప్రజల్లో ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. ఉగ్రవాదులను వారికి మించిన స్థాయిలో చూపించాల్సిన అవసరం లేదు.

ప్రశ్న: కానీ 2008 ముంబయి ఉగ్రదాడులకు తీవ్రవాదాన్నే ప్రధాన కారణంగా చూపించాం. ప్రస్తుతం మన ప్రభుత్వం ఉగ్రవాదమే ప్రధాన అంశంగా అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ పాకిస్థాన్​ను ఏకాకి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మసూద్​ అజార్​పై నిషేధం, ఎఫ్​ఏటీఎఫ్​లో పాక్​ను గ్రే లిస్ట్​లో చేర్చగలగడంలో విజయం సాధించింది కదా!

మేనన్​: ముంబయి ఉగ్రదాడి సార్వత్రిక ఎన్నికలకు ఆర్నెల్ల ముందు జరిగింది. అప్పటి ప్రచారంలో ఉగ్రవాదం ప్రధాన సమస్యగా ఉందా? ఈ విషయాన్ని జనవరిలో విపక్షాలు రెండు సార్లు గుర్తుచేయడానికి ప్రయత్నించాయి. కానీ జాతీయ విషాదాన్ని రాజకీయం చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల ప్రచారంలో ఆర్థిక సమస్యలే ప్రాథమికంగా నిలిచాయి. రెండోది పాకిస్థాన్​ను ఏకాకి చేయటం. కానీ చైనా, అమెరికా, రష్యాకు పాక్ అవసరం ఉన్నంత వరకు దాన్ని ఒంటరిని చేయలేం.

ఇప్పుడు కూడా అఫ్గాన్ ​నుంచి వెళ్లిపోవడానికి, తాలిబన్లతో చర్చల కోసం పాక్​ అవసరం అమెరికాకు ఉంది. హిందూ మహాసముద్ర మార్గం, గ్వాదర్​ నౌకాశ్రయం, సీపెక్​(చైనా,పాక్ ఆర్థిక నడవా), జిన్​జియాంగ్​ రాష్ట్రంలో ముస్లిం తీవ్రవాదం లాంటి అంశాల్లో చైనాకు పాక్​ అవసరం ఉంది. ఇవి పాక్​​కు కూడా ప్రయోజనాంశాలే. ఇక సౌదీ, ఇరాన్​ మధ్య వివాదం నడిచినన్నాళ్లు పాక్​ మధ్యవర్తిత్వం చేస్తుంది. ఇటీవల ఇరాన్​కు ఇమ్రాన్​ వెళ్లారు. ఎందుకంటే ఇతరులకు తను ఉపయోగపడేలా పాక్​ వ్యూహాలు పన్నుతుంది. ఇది ఆ దేశానికి లాభిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు పాక్​ను ఒంటరిని చేసేందుకు చూసినా అది అంతంతమాత్రమే జరుగుతుంది. పాక్​ ఎలా ప్రవర్తిస్తుందనేది ఇక్కడ సమస్య కాదు. ఈ విషయంలో మనం స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో విజయాన్ని ఆపాదించుకోవటమూ కష్టమైన పనే.

ప్రశ్న: మోదీ-జిన్​పింగ్​ భేటీకి ముందు చైనాలో ఇమ్రాన్​ ఖాన్​ పర్యటిస్తుండగా కశ్మీర్​పై డ్రాగన్​ ప్రకటన సానుకూలంగా వచ్చింది. ఈ విషయంలో చైనాను నమ్మొచ్చా?

మేనన్​: అంతర్జాతీయ సంబంధాల్లో ఎవరూ ఎవర్నీ నమ్మడానికి లేదు. మన స్వప్రయోజనాలను వరకే ఇతర దేశాలను నమ్మగలం. ఇటీవల జరిగిన పరిణామాలనే గమనిస్తే.. పాకిస్థాన్​తో సంబంధాల నేపథ్యంలో చాలా విషయాలను ప్రభావితం చేశాయి. చైనాతో పాటు ఉపఖండ రాజకీయాలూ జమ్ము కశ్మీర్​ను అంతర్జాతీయ అంశంగా చూపేందుకు ప్రయత్నించాయి. కాబట్టి.. చైనాతో పాటు ఏ దేశమైనా తమకు ఏం లాభమో అని మాత్రమే ఆలోచిస్తాయి. గొప్పదేశాలు ఇలాగే ప్రవర్తిస్తాయి.

ఎలాంటి అంశాలకు దూరంగా ఉండాలి.. దేనిపై స్పందించాలో అవి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. అందుకే ఎవరి ప్రయోజనాల ప్రకారం వాళ్లు పని చేస్తారు. కానీ అందరి అవసరాలు ఒకే రకంగా ఉంటాయని నేను అనుకోను. పాక్​లో జిన్​పింగ్​ పర్యటన తర్వాత నుంచి ఆ దేశంలో చైనా ఎంతో ఖర్చు పెడుతోంది. సీపెక్​, 62 బిలియన్​ డాలర్ల పెట్టుబడి, పాక్​లో చైనా కార్మికులు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికోసం పాక్​కు మద్దతుగా డ్రాగన్​ ఎంతోకొంత వ్యవహారం నడుపుతుంది. ఇమ్రాన్​ పర్యటనలో ఉన్నప్పుడు చైనా ప్రకటనలో మర్మమేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు ఎవరి వైపున ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జమ్ము కశ్మీర్​ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఏమీ జరగదు. మిగతా ప్రపంచాన్ని మనం ఎలా నియంత్రించగలమనేదే సమస్య. ఉదాహరణకు అమెరికా వైఖరిని చూడండి.. గతేడాది పాకిస్థాన్​పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ట్రంప్. కానీ ఇప్పుడు మళ్లీ ఇమ్రాన్​తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. పాక్​తో అవసరం ఉండటం వల్లే మధ్యవర్తిత్వం చేస్తానని అనేక సార్లు ప్రకటన చేశారు.

ప్రశ్న: కానీ ట్రంప్​ మధ్యవర్తిత్వంపై క్రమంగా మార్పులు చేశారు. రెండువైపులా అంగీకరిస్తేనే అనే షరతు పెట్టారు.

మేనన్:ఏదైనా అంశంలో రెండు వైపులా సమాన ప్రాధాన్యం ఉంటే అందులో చింతించాల్సిన అవసరం లేదు. కానీ పాక్​నుంచి ట్రంప్ ఏదో కోరుకుంటున్నారు కాబట్టే ఇలాంటి ప్రకటనలు చేశారు. దీనిప్రకారం చూస్తే ఇతర దేశాలకు పాక్​ అవసరం ఉన్నంత కాలం ఏకాకిని చేయటం కష్టమైన పనే. ఎప్పుడైతే పాక్​ అవసరం ఉండదో.. అప్పుడు ఆ దేశాన్ని ఒంటరిని చేయగలం. ఎలాగంటే మూడో అఫ్గాన్​ యుద్ధంలో సోవియట్​ ఉపసంహరణ తర్వాత పాక్​కు మద్దతు ఇవ్వటం ఇతర దేశాలు నిలిపివేశాయి.

ప్రశ్న: పాక్​ను ఆయుధంగా చైనా వాడుకుంటున్నప్పుడు.. టిబెట్​, తైవాన్, హాంకాంగ్​ సమస్యల నుంచి భారత్​ ప్రయోజనం పొందలేదా? ఈ అంశాలను భారత్​ తనకు అనుకూలంగా మార్చుకోలేదా?

మేనన్​: ఇక్కడ ఎవరి ప్రయోజనం వారు పొందటం సాధ్యం కాదు. లక్ష్యం కచ్చితంగా ఫలితంగా మారాలి. మన అవసరాలేంటి? నువ్వు ఏదైనా వాదంలో గెలిచినంత మాత్రాన అది నీ అవసరాన్ని తీర్చలేదు. ఇవి వార్తాకథనాలకు మాత్రమే అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఏ రకమైన సంబంధమైనా భారత్​ అవసరాలను తీర్చేదిగా ఉండాలి. చైనాతో మన లక్ష్యమేంటి? కేవలం ద్వైపాక్షిక సంబంధాలే దేశంలో మార్పులు తీసుకురాలేవు. సొంత ప్రజల సంక్షేమం, అభివృద్ధి లాంటి అంశాలు అంతకన్నా ముఖ్యమైనవి. అందుకే మనకు ఏదీ ముఖ్యమో దానిపైనే దృష్టి పెట్టాలి. వాదనల్లో గెలవటం కాకుండా ప్రయోజనం పొందగలగాలి.

ప్రశ్న: వుహాన్​ భేటీతో కలిగిన లాభాలేంటి?

మేనన్​: ఇది ఫలితాన్ని ఇచ్చింది. డోక్లాం స్తబ్ధత తర్వాత ఒక సంధిని ఏర్పరచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు సంబంధాలను స్థిరంగా ఉంచగలిగింది. ప్రస్తుతం మళ్లీ చైనాకు సమస్యలు తలెత్తాయి. హాంకాంగ్​, జిన్​జియాంగ్​.. ఇక అమెరికా చర్యలతో ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఈ పరిస్థితుల్లో వుహాన్​కు కొనసాగింపుగా మామల్లపురం అవసరమైంది. కానీ చెన్నై సదస్సు.. వుహాన్​ స్థాయికి మించినది అయితే కాదు.

ప్రశ్న: వుహాన్​ తర్వాత మోదీ-జిన్​పింగ్​ ఆరుసార్లు కలిశారు. ఈ భేటీల్లో యథాతథ స్థితి కొనసాగింపునకే ప్రాధాన్యం ఇవ్వడం సరైనదేనా?

మేనన్​: ఇప్పటి వరకు ఉన్న సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇతర విషయాల్లో ఎంతమేరకు ప్రయత్నాలు జరిగాయో తెలియదు. దేశాధినేతల వ్యక్తిగత సంభాషణపై అవగాహన వచ్చేవరకు ఈ విషయాలు ఊహాగానాలకు మాత్రమే పరిమితం.

ప్రశ్న: చైనా బీఆర్​ఐలో సీపెక్​ ప్రధానమైన ప్రాజెక్టు. దక్షిణాసియా దేశాల్లో చైనా స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంటే భారత్​ పరిస్థితి ఏమిటి? నేపాల్​లో పర్యటించిన జిన్​పింగ్​ అనుసంధాన ప్రాజెక్టులను ప్రకటించారు. బీఆర్​ఐపై భారత్​ తన వైఖరిని కొనసాగించగలదా?

మేనన్​: దీనిపై మన వైఖరి ఏంటో స్పష్టంగా తెలియదు. కానీ బీఆర్​ఐలో భాగంగా పీఓకే గుండా నిర్మిస్తున్న సీపెక్​ను భారత్​ వ్యతిరేస్తున్న విషయం మాత్రం స్పష్టం. ఎందుకంటే ఈ చర్యలు భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని వ్యతిరేకించవచ్చు. అయితే వుహాన్​ భేటీ తర్వాత అవసరాలకు తగినట్లు వ్యవహరించాలి. అవసరం ఉన్న చోట బీఆర్​ఐను ఆహ్వానించవచ్చు. మనకు ప్రమాదం పొంచి ప్రాంతాల్లో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు గ్వాదర్​ నౌకాశ్రయాన్ని సైనిక స్థావరంగా మారుతుంటే దాన్ని ఆపేందుకు సర్వశక్తులు ఒడ్డాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిబౌటీలో చైనాకు స్థావరం ఉంది. ఇలాగే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గ్వాదర్​, హంబన్​తోట లాంటివి సైనిక స్థావరాలుగా మారకుండా చర్యలు తీసుకోవాలి. కానీ బీఆర్​ఐలో వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొలంబో నౌకాశ్రయాన్ని చైనా నిర్మించింది. కానీ అక్కడ 83 శాతం భారత్​ వ్యాపారమే సాగుతుంది. అది మన అవసరం. ఫలితంగా వచ్చే ఆదాయం చైనాకు ప్రతిఫలంగా వెళుతుంది. దీనివల్ల చైనా, శ్రీలంక, భారత్​కు ఆర్థికంగా లాభదాయకం. వాణిజ్య పరమైన బీఆర్​ఐ ప్రాజెక్టులను మాత్రమే అనుమతించి ప్రయోజనం పొందాలి.

ప్రశ్న: ఇలా అవసరానికి తగ్గట్టుగా వ్యవహరించటం వల్ల భారత సార్వభౌమ అధికారానికి నష్టం వాటిల్లదా?

మేనన్​: కొలంబో పోర్టుతో ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే మనం దానిపై ఆధారపడటం లేదు. కానీ సొంత నౌకాశ్రయాలు నిర్మించుకునేవరకు మాత్రం వాడుకోవచ్చు. ఎందుకంటే బీఆర్​ఐకు ఎలాంటి ఒప్పందం లేదు. బీఆర్​ఐలో చేరతామంటూ ఎలాంటి ఒప్పందం భారత్​ చేసుకోలేదు. బీఆర్ఐను నిర్వచించేలా ఎలాంటి వ్యవస్థ కానీ, స్థలం కానీ లేదు. ఈ ప్రక్రియను చైనాకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే అమలు చేస్తోంది. తనకు నష్టం వాటిల్లే అవకాశాలున్న ప్రాంతాల్లో కొన్నింటిని ఉపసంహరించుకుంది. మరికొన్నింటిని బీఆర్ఐ హోదా నుంచి తొలగించింది. బీఆర్ఐకి సంబంధించిన ప్రాజెక్టులపై గత రెండేళ్ల పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సర్వే చేసింది చైనా. ఇది పురోగతి చెందే సమయం అవటం వల్ల ఇందులో ఎలాంటి వ్యతిరేకత ఉండదు. మన ప్రయోజనాల వరకు మాత్రమే మనం దీన్ని వినియోగించుకోగలం. అదీ బీఆర్ఐలో భాగస్వాములమనే ముద్ర పడనంతవరకు మాత్రమే. లేదా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ప్రశ్న: రీసెప్ లో చైనాతో కలిసి భారత్ ఒప్పందం చేసుకుంటుందని మీరెలా భావిస్తున్నారు?

మేనన్:చర్చలు జరుగుతున్న సమయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం ముందే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదా తూర్పు ఆసియా విధానాలను పాటించడంలో విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రారంభ సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎపీఈసీ నాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. నాకు అవసరమైనప్పుడే చేరతానంటే ఎవరూ అంగీకరించరు. జపాన్, చైనా తరహాలో రీసెప్, ప్రపంచ వాణిజ్య సంస్థల్లో చేరేందుకు అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలి. రాజకీయంగా చేయలేని పనులను బయటి ఒత్తిడి ద్వారా చేసే అవకాశం కలుగుతుంది. ఎలాగంటే 1991 ఆర్థిక సంక్షోభం సమయంలో తీసుకొచ్చిన సంస్కరణలు మాదిరి ప్రస్తుత తరుణంలో అమలు చేయాల్సి ఉంది. కానీ అది సంక్షోభానికి చేరువగా వచ్చే వరకు సాధ్యం కాదు. అందుకే విదేశాల నుంచి ఒత్తిడి, అంతర్జాతీయ చర్చల ద్వారా ఆర్థిక సంస్కరణలు చేపట్టే అవకాశం కలుగుతుంది. మిగతా ప్రపంచంతో పోటీపడి నిలదొక్కుకునే స్థితికి రాగలుగుతాం. చైనాకు దీటుగా నిలిచే ఒకటి రెండు పరిశ్రమలతో భారత విదేశీ వాణిజ్య విధానాన్ని నడపలేం. ఇది అంతకుమించిన అంశం. ఎందుకంటే భారత వినియోగదారులు, ఆర్థిక వ్యవస్థ అందులో భాగమే. ఇప్పటికే సగానికి పైగా జీడీపీ విదేశీ వాణిజ్యం నుంచే వస్తోంది. ఇక్కడి నుంచి మళ్లీ వెనక్కు వెళ్లలేం. 1991లో జీడీపీలో 15.3 శాతం మాత్రమే విదేశీ వాణిజ్యం ఉండేది. వెనక్కి చూశామంటే 50, 60 దశకాల్లో నమోదైన 2,3 శాతం జీడీపీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది స్థిరమైన వృద్ధిని ఇవ్వదు. ఎందుకంటే ఏటా 1.1 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలి. ఇదొక పెద్ద వ్యూహాత్మక అంశం. మనకు అవసరమైనంత మేర పొందగలగాలి. గడిచిన 6 సంవత్సరాల్లో మనం ఏం సాధించామో గమనించుకోవాలి.

ప్రశ్న: ‘కుట్టీ’ అనేది విదేశాంగ విధానం కాదని మీరు తరచూ చెబుతారు. కశ్మీర్ విషయంలో అణుబాంబులను ప్రయోగిస్తామని పాకిస్థాన్ అదే పనిగా హెచ్చరికలు చేస్తోంది. అణ్వాయుధాలను మొదటగా ప్రయోగించం(ఎన్ఎఫ్ యూ)ను సమీక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అణు ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఏదైనా ఉందా?

మేనన్: రెండు వైపులా నియంత్రిత స్థాయిలో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి భారత్-పాక్. ఇద్దరికీ దేశీయ ఎజెండాలే ప్రాధాన్యాలుగా కనిపిస్తున్నాయి. పాక్ లో బలహీన ప్రభుత్వం కారణంగా సైన్యంపై ఆధారపడుతోంది. సైన్యం చేతిలో ప్రభుత్వం కావటం వల్ల అంతర్గతంగా బలపడేందుకు శత్రు విధానాలను పాటిస్తోంది. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. అంతే తప్ప ఉద్రిక్తతలు పెరిగే అవకాశం లేదనే భావిస్తున్నా. ఎందుకంటే బాలాకోట్ తర్వాత రెండు దేశాలు వెనక్కుతగ్గాయి. పాకిస్థానీలు మనకన్నా భిన్నమైన వారేమీ కాదు. రెండు దేశాలు అంత తెలివితక్కువగా వ్యవహరించవు. హేతుబద్ధంగానే నడుచుకుంటాయి. ఉపఖండంలో అణ్వాయుధాల రాక పరిస్థితిని కొంత మేర స్థిరపరిచింది. అందువల్ల చర్చలు తక్కువ స్థాయిలో ఉన్నా.. అసలు లేకపోయినా.. శత్రుత్వాన్ని పరిమిత స్థాయిలోనే కొనసాగిస్తాయి. అంతకు మించి అణు ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండదు.
ప్రశ్న: అణ్వాయుధాలను మొదట ప్రయోగించం అనే నిబంధనను సమీక్షించాల్సిన అవసరం ఉందా?

మేనన్: ఈ విషయాన్ని నా పుస్తకంలోనూ ప్రస్తావించాను. పరిస్థితులను బట్టి సమీక్షించవచ్చు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదనే అనుకుంటున్నాను. తప్పకుండా సమీక్షించాల్సిన అవసరం ఉంటే మారాల్సి వస్తుంది. ఇది మన సిద్ధాంతాలు, ఎదుర్కొన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వాటిని బట్టి సమీక్షను కొనసాగించవచ్చు. మొదట ప్రయోగించమనే అంశాన్ని ఇప్పటికి నాకు తెలిసి మూడు నాలుగు సార్లు సమీక్షించారు. ఈ ప్రభుత్వం కూడా సమీక్షించే ఉంటుంది.. ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని క్రమం తప్పకుండా సమీక్షించాలి. కానీ ఏదో హామీ కోసం మార్చుతున్నామని కాకుండా హేతుబద్ధంగా ఉండాలి. అప్పుడే అది మన ప్రయోజనాలను కాపాడుతుంది.

ప్రశ్న: భారత్-పాక్ మధ్య కర్తార్ పుర్ నడవా ఏమైనా మార్పులు తీసుకురాగలదా?

మేనన్:ఇది అంత ప్రాధాన్యమైన అంశమని నేను భావించట్లేదు.

Last Updated : Oct 16, 2019, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details