నేడు గవర్నర్‌తో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ భేటీ రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి శివసేన చేపడుతోందని ప్రతిపాదిత కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ సర్కారు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా ఇప్పటికే సిద్ధమయిందని సమాచారం.
మూడు పార్టీల ప్రతినిధులు నేడు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో భేటీ కానున్నారు. రైతు సమస్యలపై చర్చించేందుకే గవర్నర్‌తో భేటీ అని మూడు పార్టీల నేతలు చెబుతున్నా.. ప్రభుత్వ ఏర్పాటుపై సంసిద్ధత వ్యక్తం చేసేందుకేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
"మధ్యంతర ఎన్నికలకు అవకాశం లేదు. మూడు పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈ సర్కారు ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుంది."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
సీఎం పదవి విషయంలోనే.. మహాకూటమి నుంచి సేన బయటకు వచ్చిందని.. వారి అభిప్రాయాన్ని గౌరవించడం తమ బాధ్యత అని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం శివసేనదేనని పేర్కొన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. అధికారంలో 25 ఏళ్లపాటు కొనసాగుతామని ధీమా వ్యక్తం చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.
'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే'
మహారాష్ట్ర శాసనసభలో తమకు 119 మంది శాసనసభ్యుల బలం ఉందని.. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా నేత చంద్రకాంత్ పాటిల్ అభిప్రాయపడ్డారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ఏర్పాటవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు పాటిల్. తాము 105 సీట్లను గెలుచుకున్నప్పటికీ పలువురు స్వతంత్రులు తమకే మద్దతిస్తున్న కారణంగా.. సంఖ్య 119కి చేరిందని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: కత్తి తిప్పిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!