'ఆరే' ప్రస్తావన లేకుండానే శివసేన మేనిఫెస్టో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీచేస్తున్న శివసేన తన సొంత మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ ఎన్నికల ప్రణాళికను ముంబయిలో ఆవిష్కరించారు.
రైతులకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తామని శివసేన తన మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చింది. భోజనం రూ.10లకే అందిస్తామని వాగ్దానం చేసింది.
'ఆరే' గురించి ప్రస్తావించని సేన
ముంబయిలోని ఆరే ప్రాంతంలో మెట్రోకారు షెడ్డు నిర్మాణం కోసం చెట్లు నరికివేయడాన్ని వ్యతిరేకిస్తున్న శివసేన.. మేనిఫెస్టోలో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే తాము చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తున్నామని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.
మేనిఫెస్టో.. ముఖ్యాంశాలు
రైతులను రుణరహితం చేస్తామని శివసేన హామీ ఇచ్చింది. మహారాష్ట్ర వ్యాప్తంగా 1000 భోజనశాలలు ఏర్పాటుచేసి, అందులో కేవలం రూ.10లకే భోజనం అందిస్తామని తెలిపింది. 300 వందల యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని పేర్కొంది. ఒక్క రూపాయికే 200 రోగాలకు పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం రోగ నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని శివసేన హామీ ఇచ్చింది.
భాజపాతో కలిసి
మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా-శివసేన కలిసి పోటీచేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో శివసేన 124 చోట్ల బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు రానున్నాయి.
ఇదీ చూడండి:కశ్మీర్లో గ్రెనేడ్ దాడి- ముష్కరుల కోసం గాలింపు