శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన వెల్లడించారు. ఈ సంఖ్య 175కు కూడా చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అహంకారం అనే బురదలో
సంజయ్ రౌత్ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అనే రథం ' (భాజపా)అహంకారం అనే బురద'లో చిక్కుకుందని ఆయన విమర్శించారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించవచ్చన్న భాజపా నేతల వ్యాఖ్యలపైనా సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ విషయంపై శివసేన పత్రిక సామ్నాలో 'రాష్ట్రపతిపాలనకు భాజపా సిద్ధపడడం అంటే అది ఆ పార్టీకి ఈ దశాబ్దంలోనే పెద్ద ఓటమి అవుతుంది' అని వ్యాఖ్యానించారు.