తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్ ఎన్నికల బరిలో శివసేన- ఠాక్రే సమాలోచనలు! - sanjay raut

బిహార్​ శాసనసభ ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. 243 స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటినుంచే గెలుపు కోసం ఆయా పార్టీలు సన్నద్ధమయ్యాయి. నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిహార్​ ఎన్నికల్లో శివసేన పోటీ చేయనుందని పార్టీ ఎంపీ సంజయ్​రౌత్​ పరోక్షంగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

shiv sena in bihar elections
బిహార్​ ఎన్నికల్లో పోటీకి శివసేన యోచన!

By

Published : Sep 26, 2020, 4:51 PM IST

Updated : Sep 26, 2020, 5:24 PM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. 3 విడతల్లో పోలింగ్​ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతి రోజు నుంచే నేతలు విమర్శలకు పదును పెడుతున్నారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి వ్యవహారాన్ని పావుగా వాడుకోవాలని బిహార్‌లో నేతలు చూస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ స్పందించారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, పరిపాలన తదితర సమస్యల పరిష్కారమే అజెండాగా బిహార్‌ ఎన్నికలు జరగాలని, తీర్చడానికి సమస్యలు లేవని అక్కడి నేతలు భావిస్తే.. ప్రజా సమస్యలను ముంబయి నుంచి పార్సిల్‌లో పంపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

ఠాక్రే చేతుల్లో...

అంతేకాకుండా బిహార్‌ ఎన్నికల్లో శివసేన పోటీ చేయనుందని పరోక్షంగా చెప్పారు. దీనిపై పార్టీ అగ్రనేత ఉద్ధవ్‌ ఠాక్రే రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారన్నారు. బిహార్‌లో ఎన్నికలు కులాలకు మధ్య జరగబోయే పోటీయే తప్ప, వ్యవయసాయ బిల్లులు, రైతులు హక్కులాంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపబోవని పరోక్షంగా అధికార భాజపా-జేడీయూ ప్రభుత్వాన్ని విమర్శించారు. గత జూన్‌ 14న సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిచెందిన తర్వాత బిహార్‌, ముంబయి పోలీసు విభాగాలు వేర్వేరుగా విచారణ చేపడుతున్నాయి.

నితీశ్​తో భేటీ..

సుశాంత్​ కేసులో మహారాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని బిహార్‌ మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ఆరోపించారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని, అందుకే స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్నారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన ఇవాళ బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ను కలవడం దీనికి బలం చేకూరుస్తోంది.

వారం క్రితమే వీఆర్​ఎస్​ తీసుకున్న గుప్తేశ్వర్​ పాండే బిహార్​లోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తనపై నమ్మకం ఉంచినందుకు పాండే కృతజ్ఞతలు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై స్పందించిన మాజీ డీజీపీ.. సీఎంను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. చాలా కాలం కలిసి పనిచేసినందున మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని పేర్కొన్నారు. ఒకవేళ రాజకీయ ప్రవేశం ఉంటే అది అందరికీ తెలిసేలా జరుగుతుందని మీడియాకు వెల్లడించారు.

3 దశల్లో పోలింగ్​...

మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు (అక్టోబరు 28, నవంబరు 3, 7) నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 7.29 కోట్ల మంది ఓటర్లున్న బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోడా దిల్లీలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో ప్రపంచంలో నిర్వహిస్తున్న అతి పెద్ద ఎన్నికలు ఇవేనని ఆయన అభివర్ణించారు. బిహార్‌ శాసనసభ కాలపరిమితి నవంబరు 29తో ముగియనుంది.

Last Updated : Sep 26, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details