తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం శివసేనదే..! - మరికాసేపట్లో 'మహా రాజకీయ' భవితవ్యం!

మరికాసేపట్లో 'మహా రాజకీయ' భవితవ్యం!

By

Published : Nov 22, 2019, 10:41 AM IST

Updated : Nov 22, 2019, 7:38 PM IST

19:57 November 22

మహా సీఎంగా ఉద్ధవ్​ ఠాక్రే: పవార్

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరడం ఖాయమైంది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ మేరకు సుదీర్ఘ చర్చలు జరిపిన మూడు పార్టీల అగ్ర నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ స్పష్టతనిచ్చారు. శివసేన నేతృత్వంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉంటారని పవార్​ ధ్రువీకరించారు.

ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకాలపై ముంబయిలో 3 పార్టీల నేతలు భేటీ అయ్యారు. 3 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిత్వ శాఖల పంపకాలపై చర్చించినట్లు సమాచారం. చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు సమావేశం అనంతరం ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు.

ఈ మేరకు రేపు 3 పార్టీల నేతలు మీడియా ముందుకు వస్తారని శరద్​ పవార్​ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అప్పుడే వెల్లడిస్తామన్నారు. గవర్నర్‌ను కలిసే అంశంపైనా రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు పవార్.

చర్చలు కొనసాగుతాయి..

భేటీ అనంతరం కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. శివసేనతో సానుకూలంగా చర్చలు జరిపామని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్​ చవాన్​ తెలిపారు. అయితే చర్చలు ఇంకా పూర్తి కాలేదని.. రేపు కూడా కొనసాగుతాయన్నారు. ముఖ్యమంత్రి అంశమై.. పవార్​ ప్రకటనపై స్పందించేందుకు చవాన్ నిరాకరించారు. పూర్తి స్థాయి చర్చలు జరిగాక ఈ విషయంపై మాట్లాడతామని పేర్కొన్నారు.

18:59 November 22

ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే: పవార్​

శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ అన్నారు. కూటమి ప్రభుత్వానికీి ఠాక్రే నాయకత్వం వహించాలని కోరారు. మిగతా అంశాలకు సంబంధించి రేపు ఉమ్మడి మీడియా సమావేశంలో చెబుతామని ఆయన స్పష్టం చేశారు.

18:49 November 22

ముగిసిన భేటీ... రేపు మీడియా సమావేశం

  • ముంబయిలో ముగిసిన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ నేతల సమావేశం
  • ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించిన 3 పార్టీల ముఖ్య నేతలు
  • మా మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయి: శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే
  • రేపు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం: ఉద్ధవ్ ఠాక్రే

17:28 November 22

ప్రభుత్వ ఏర్పాటుపై 3 పార్టీల కీలక భేటీ

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై 3 పార్టీల ప్రముఖ నేతలు ముంబయిలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలోని కీలక నేతలు ముంబయిలోని నెహ్రూ సెంటర్​లో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నెల రోజుల అనంతరం శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ మూడు పార్టీలు అంగీకరించాయి.

శివసేన తరఫున ఏకనాథ్ శిందే, సుభాశ్ దేశాయి, సంజయ్​ రౌత్​.. కాంగ్రెస్​ నుంచి అహ్మద్​ పటేల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే, బాలాసాహెబ్ థోరట్, పృథ్వీరాజ్ చవాన్​.. ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, అజిత్ పవార్​ తదితరులు హాజరయ్యారు.

సమావేశానికి ముందు ఖర్గే మాట్లాడుతూ.. భేటీలో తీసుకున్న నిర్ణయాలను బట్టి ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందన్నారు. ఈ  సమావేశంలో ముఖ్యంగా అధికార విభజన, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

16:49 November 22

'మహా'భేటీకి వేళాయె..!

మహారాష్ట్ర ప్రతిష్టంభనకు తెర పడేందుకు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో కాంగ్రెస్​-ఎన్సీపీ-శివసేన మహా భేటీకి సిద్ధమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ సీనియర్లు సమావేశం కోసం... మహారాష్ట్రలోని నెహ్రూ సెంటర్​కు చేరుకుంటున్నారు. 

15:46 November 22

సేన నేతృత్వంలోనే ప్రభుత్వం.. ఆఖరి అంకానికి ఏర్పాటు ప్రక్రియ..!

సేన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని విలేకర్లతో వెల్లడించారు శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే. కాంగ్రెస్​-ఎన్​సీపీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పించేలా కృషి చేసినందుకు ఎమ్మెల్యేలను ఠాక్రే అభినందించినట్లు తెలిపారు సేన ఎమ్మెల్యే జాదవ్​ భాస్కర్​. 

ఎమ్మెల్యేలంతా ఉద్ధవ్​ ఠాక్రేనే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కానీ.. ఠాక్రే ఏ నిర్ణయం తీసుకున్నా.. అంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

ఉద్ధవ్​ ఠాక్రేను.. భాజపా మళ్లీ సంప్రదించినట్లు వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు భాస్కర్​. అలాంటిదేమీ లేదన్నారు. 2, 3 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

14:40 November 22

'కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేనవి అవకాశవాద రాజకీయాలు'

కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు భాజపా నేత, కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. ఆ మూడు పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. వీరి కూటమిలో మహారాష్ట్రలో ఏర్పాటయ్యే ప్రభుత్వం 6 నుంచి 8 నెలలు కూడా నిలవదని ఎద్దేవా చేశారు.

14:22 November 22

శివసేనదే సీఎం కుర్చీ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం శివసేనదేనని ప్రకటించారు కాంగ్రెస్​ నేత మాణిక్​రావ్ ఠాక్రే. సీఎం పదవికోసం ఎన్​సీపీ ఎలాంటి డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. 

13:47 November 22

శివసేన కీలక సమావేశం

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్​సీపీ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయగా.. తాజాగా తదుపరి వ్యూహంపై సేన సమావేశమైంది. పార్టీ శాసనసభ్యులతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ఠాక్రే సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి పదవి శివసేనకే దక్కుతుందని దాదాపుగా ఖరారు కాగా ఆ పదవిని ఎవరు అధిష్టించాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవిని ఉద్ధవ్​ఠాక్రేకు అప్పగించాలా లేక ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేను ఆ పీఠంపై కూర్చోబెట్టాలా అన్న అంశంపై ఈ భేటీ తర్వాత స్పష్టత రానుంది. 

10:42 November 22

'ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో కలిసేది లేదు'

భాజపాతో కలిసేది లేదని తేల్చి చెప్పారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్. ఇంద్రుడి సింహాసనం ఇచ్చినా భాజపాతో పొత్తు పెట్టుకోబోమని వ్యాఖ్యానించారు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పదవి తమదేనని ఉద్ఘాటించారు.

"ఆఫర్లకు సమయం పూర్తయ్యింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు."
-సంజయ్​ రౌత్, శివసేన ఎంపీ

సేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ నేతలు మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్​సింగ్ కోశ్యారీతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్​ను ఎందుకు కలవాలని అనుకుంటున్నారు అన్న విలేకరుల ప్రశ్నకు పైవిధంగా జవాబిచ్చారు రౌత్. 
 

10:03 November 22

మరికాసేపట్లో తేలనున్న 'మహా రాజకీయ' భవితవ్యం!

మహారాష్ట్ర రాజకీయ భవితవ్యం మరికాసేపట్లో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతకొద్ది రోజులుగా  రాజకీయ సంక్షోభం నెలకొన్న రాష్ట్రంలో.. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడనున్నట్లు సేన ఎంపీ సంజయ్​ రౌత్​ ప్రకటించారు. ఐదేళ్లు కొనసాగేలా సుదీర్ఘ ప్రభుత్వం ఏర్పాటుకానుందని వెల్లడించారు. శివసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని స్పష్టం చేశారు.

అయితే మూడు పార్టీల మధ్య నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ముఖ్య ప్రకటన చేయనున్నారు. దీనితో ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన మహా ప్రతిష్టంభనకు నేటితో తెరపడే అవకాశముంది. 

Last Updated : Nov 22, 2019, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details