అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్... తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రెండేళ్ల పాటు ఎదురు చూశారట. సాధారణ కుటుంబంలో పుట్టిన షీలా ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించారు. అయితే కాబోయే అత్త అంగీకారం కోసం ఏకంగా రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తన ప్రేమకథను ఒకానొక సందర్భంలో మీడియాతో పంచుకున్నారామె. అది ఆమె మాటల్లోనే..
"నేను ఎంఏ హిస్టరీ చదువుతున్న రోజుల్లో వినోద్‌ను మొదటిసారి చూశా. మా ఇద్దరిదీ ఒకే క్లాస్. తొలి చూపులోనే ప్రేమ అని చెప్పలేను గానీ వినోద్ చాలా చలాకీగా ఉండేవారు. అందరితో ఇట్టే కలిసిపోయేవారు. అయితే తనతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా స్నేహితురాలు.. తన స్నేహితుడు ప్రేమించుకున్నారు. వారి మధ్య జరిగిన గొడవను పరిష్కరించే సమయంలో మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. వారి సమస్య పరిష్కారం కాలేదు గానీ, మేం మాత్రం మంచి స్నేహితులమయ్యాం.
రోజులు గడుస్తున్న కొద్దీ మా ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. నాది నెమ్మది స్వభావం. తనది దూకుడు మనస్తత్వం. ఆ విభిన్న ధ్రువాలే మమ్మల్ని దగ్గర చేశాయి. క్రమంగా తనకు నేను అన్ని చెప్పుకొనేంత దగ్గరయ్యాం. ఏ రోజూ మా మధ్య కుటుంబ విషయాలు రాలేదు.
ఆ మాట చెప్పినప్పుడు...
నాతో మాట్లాడేందుకు ఆయన నేను ఎక్కిన బస్సులోనే ఎక్కేవారు. ఫైనల్ పరీక్షలకు ఒక రోజు ముందు మేం ఇద్దరం బస్సులో వెళుతున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాకు దొరికింది అని వాళ్ల అమ్మతో చెప్పాలనుకుంటున్నాని నాతో అన్నారు. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కున్నారా? అని తిరిగి ప్రశ్నించాను. దానికి ఆయన.. లేదు, కానీ తాను నా పక్కనే కూర్చుంది అని అన్నారు. అంతే నేను ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.
మా ఇంట్లో చెప్పేశాను..
రెండు రోజుల తర్వాత వినోద్ గురించి మా ఇంట్లో చెప్పాను. మా కుటుంబంలో కులమతాల పట్టింపులు లేవు. అయితే మేం ఇంకా జీవితంలో స్థిరపడకపోవడం వల్ల వారు ఒప్పుకోలేదు. కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. అప్పటికే వినోద్ ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నారు.