భారత రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా పేరుగాంచిన దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఇకలేరు. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్న షీలా.. దిల్లీకి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. భాజపా నేత సుష్మా స్వరాజ్ తర్వాత దిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ షీలానే.
పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31న షీలా జన్మించారు. దిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం జరిగింది. దిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుంచి ఎంఏ హిస్టరీలో పట్టభద్రులు అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఐఏఎస్ వినోద్ దీక్షిత్‌తో ఈమె వివాహం జరిగింది. షీలాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సందీప్ దీక్షిత్ 15వ లోక్‌సభకు తూర్పు దిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
మామయ్య వారసత్వం
షీలా మామగారు ఉమాశంకర్ దీక్షిత్ స్వాతంత్ర్య సమయోధులు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో షీలా తన మామయ్యకు ఎన్నో విషయాల్లో సాయంగా ఉండేవారట. పాలనా వ్యవహారాల్లో ఆమె ప్రతిభను మెచ్చి ఐరాసలో భారత ప్రతినిధిగా నామినేట్ చేశారు ఇందిరా. అలా రాజకీయాల్లోకి అనుకోకుండా ప్రవేశించారు షీలా దీక్షిత్.