అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు నేడు నిగంబోధ్ ఘాట్ వద్ద జరగనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రజల సందర్శించేందుకు తూర్పు నిజాముద్దీన్‌లోని స్వగృహంలో షీలా పార్థివ దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళతారు. అక్కడ నివాళులర్పించిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమౌతుంది.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు 81 ఏళ్ల షీలా దీక్షిత్. ఫ్రాన్స్‌లో గతేడాది హృదయ సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న క్రమంలో శనివారం సాయంత్రం గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారు. మృతి వివరాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు భౌతిక కాయం వద్దకు చేరుకుని సహచర నేత మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
ప్రముఖుల నివాళి
షీలా పార్థివ దేహం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రద్ధాంజలి ఘటించారు. దీక్షిత్ నివాసానికి చేరుకున్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా దిల్లీ మాజీ సీఎం మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, భాజపా సీనియర్ నేత ఆడ్వాణీ భౌతిక దేహం వద్ద నివాళులర్పించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నటి షర్మిలా ఠాగూర్ సహా కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు షీల పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రాష్ట్రపతి విచారం
"షీలా దీక్షిత్ మరణ వార్త బాధ కలిగించింది. ఒక సీనియర్ రాజకీయ నేతను కోల్పోయాం. రాజధాని ముఖచిత్రం మారడంలో షీలా కృషి గుర్తుంచుకోదగినది. "
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
ప్రధాని దిగ్భ్రాంతి
"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమెది స్నేహపూర్వక వ్యక్తిత్వం. దిల్లీ అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యం మరువలేం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."
-ప్రధాని నరేంద్రమోదీ
కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం