అంధురాలైనా అద్భుత గాయని ఆ చిన్నారి సామాజిక మాధ్యమాలు కొందరి జీవితాలను అద్భుత మలుపు తిప్పుతాయి. చాలా సందర్భాల్లో అది నిరూపితమైంది. ఇటీవలే బంగాల్లోని రణఘాట్ రైల్వే స్టేషన్లో ఉండే రేణూ మోండల్ అనే మహిళ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఇదే సోషల్ మీడియా మరో గాయనిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె ఎవరో కాదు.. కేరళలోని కన్నూర్కు చెందిన ఎనిమిదేళ్ల అనన్య. కొద్ది రోజుల క్రితం ఓ అంధ బాలిక పాఠశాల యూనిఫాంలో 'ఉయరే' అనే మళయాలి చిత్రంలోని 'నీ ముకిలో' అనే పాటను పాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చిన్నారి గాత్రానికి దేశ నలుమూలల నుంచి అభినందనలు అందాయి. ఆ చిన్నారే అనన్య.
ఉయారే చిత్రంలోని పాటను పాప పాడిన తీరుకు ముగ్ధుడైన ప్రముఖ మళయాల సంగీత దర్శకుడు బిజిబాల్ అనన్య చిన్నారికి తన తదుపరి సినిమాలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడు. అనన్య ఇప్పటికే చాలా రియాలిటీ షోలల్లో పాల్గొని తన గాత్రాన్ని వినిపించింది.
కేరళలోని కన్నూర్కు చెందిన పుష్పాన్, ప్రజితల చిన్నకూతురు అనన్య. పుట్టుకతోనే చూపులేదు. పాపకు ఐదేళ్ల వయసులో రేడియోలో పాటలు వింటూ తిరిగి అంతే మధురంగా పాడటాన్ని గుర్తించారు తల్లిదండ్రులు. చిన్నారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి మ్యూజిక్ తరగతులకు పంపించారు. ప్రస్తుతం సంగీత పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారికి కేరళతో పాటు దేశవ్యాప్తంగా ప్రసంశలు అందుతున్నాయి.
ఇదీ చూడండి: కళాశాల విద్యార్థిగా మారిన 103 ఏళ్ల వృద్ధుడు!