దేశ రాజకీయాల గురించి తెలిసినవారికి శరద్ పవార్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. జాతీయత విషయంలో సోనియాతో విభేదించి.. కాంగ్రెస్‌ను కాదని సొంతంగా పార్టీ పెట్టడమే కాదు... అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి. లౌకికవాదం విషయంలో భాజపాతోనూ.. జాతీయత వివాదంతో కాంగ్రెస్‌తోనూ దూరంగా ఉంటూ వచ్చిన వ్యక్తి. మరాఠా యోధుడిగా పేరొందిన ఆయన రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఓ పట్టాన అంతు పట్టవు. మహారాష్ట్ర రాజకీయాలను తాను లేకుండా ఊహించలేం అన్నంత ప్రభావం చూపిన వ్యక్తి. ఎలాంటి రాజకీయ సమస్య అయినా పరిష్కరించే వ్యక్తిగా పేరొందిన పవార్... చిక్కుల్లో పడినట్టే పడి వాటి నుంచి బయటకు రావడం ఆయనకే చెల్లింది. ఈ మాటలన్నింటికీ మరోసారి నిదర్శనంగా ఫలితాలు చూపించారు.. పవార్.
భాజపాకు ఊహించని ఝలక్
మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే శరద్ పవార్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది మరోసారి అందరికీ అర్థమై ఉంటుంది. తన చేతుల్లోంచి అంతా జారిపోతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. చివరికంటా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన చేసిన పోరాటం అసలు సిసలు రాజకీయ యోధుడ్ని గుర్తుకు తెస్తుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి పొత్తు కుదుర్చుకొని ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి అనుకున్న తరుణంలో .. శనివారం నాటికి భాజపా ఊహించిన ఝలక్ ఇచ్చింది. ఇందుకు కేంద్ర బిందువుగా శరద్ పవార్ అన్నయ్య కుమారుడు అజిత్ పవార్ మారారు. కానీ ఈ పరిణామాలతో ఏ మాత్రం తడబడని శరద్ పవార్.. ఇప్పుడు అదే రీతిలో తన దెబ్బ ఎలా ఉంటుందో భాజపాకు రుచి చూపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో భాజపా బలం నిరూపించుకుంటుందన్న సమయంలో ఊహించని మలుపు తిప్పారు శరద్ పవార్.
భాజపాను అధికారానికి దూరంగా ఉంచాలని చెబుతూ వచ్చిన శరద్‌పవార్.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే.. ఆ పార్టీ వేసిన ఎత్తులకు చిత్తయినట్టే అందరూ అనుకున్నారు. కానీ పడిలేచిన కెరటంలా ఒక్కసారిగా భాజపా ఊహకే అందని వ్యూహాలతో చిత్తు చేశారు.
ఎన్నో ఊహాగానాలు
పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయటం.. శరద్ పవార్ నేరుగా ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ అవ్వటం... ఇవన్నీ శరద్ పవార్ వైఖరిపై అనుమానాలు రేకెత్తేలా చేశాయి. అవన్నీ కూడా వ్యుహంలో భాగమేనన్నది విశ్లేషకుల మాట. శరద్ పవార్ కుమార్తె కారణంగా పార్టీలో కుటుంబ పరమైన విబేధాలు ప్రభావం చూపాయన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో పవార్ కుటుంబం, ఎన్సీపీ చీలిపోయాయంటూ ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టి పడింది. బాబాయ్, అబ్బాయికి పడటం లేదని.. రాజకీయ వారసత్వం విషయంలో శరద్ పవార్ కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే అజిత్ పవార్ వేరుకుంపటి పెట్టినట్టు చెప్పుకున్నారు. ఈ విషయంలో శరద్ పవార్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
భాజపాకు ఎప్పుడైతే అజిత్ పవార్ మద్దతిచ్చారో అప్పుడే శరద్ పవార్ డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ బహిరంగంగానే చెప్పింది. అజిత్ పవార్ విషయంలో తన పాత్ర ఏ మాత్రం లేదని, అది ఆయన వ్యక్తిగత విషయమని శరద్ పవార్ చెప్పినప్పటికీ చాలామంది దాన్ని విశ్వసించలేదు. చివరకు ఎన్పీపీ శాసనభాపక్ష నేత పదవి నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్టు కూడా శరద్ పవార్ ప్రకటించారు. అయినాకానీ ఇదంతా కావాలని చేస్తున్నదే అన్నట్టు చాలా మంది భావించారు. శరద్ పవార్ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో భాజపాకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఎమ్మెల్యేలందరితో కలిపి మహా బలప్రదర్శన నిర్వహించారు.
గోవా కాదు మహారాష్ట్ర...