ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ మేరకు 10 మావోయిస‌్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు షా. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
బ్యాంకులు, తపాలా వంటి మౌలిక సౌకర్యాలు సహా కేంద్ర పథకాలను మరింత సులువుగా ఉపయోగించుకునేలా చూడాలని తీర్మానించారు. మావోయిస్టులకు వ‌్యతిరేకంగా చేపట్టిన చర్యలు, ప్రభావిత ప్రాంతాల్లో అనుసరించిన అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రులకు వివరించారు అమిత్ షా.
తెలుగు రాష్ట్రాలకు ప్రశంసలు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఉపముఖ‌్యమంత్రి మహమ్మూద్ అలీ సహా వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిథులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. నక్సల్స్ నిర్మూలన చర్యల్లో ఏపీ, తెలంగాణ సఫలీకృతమయ్యాయని సమావేశం ప్రారంభంలో హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కొనియాడారు.
10 జిల్లాలే కీలకం
దేశం మొత్తం మీద 10 జిల్లాల్లోనే నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు గురించి ఆలోచన వద్దని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పినట్లు సమాచారం.