'కార్మికుల సంక్షేమం కోసం రూ.24 ఇవ్వలేరా?' కేంద్ర ప్రభుత్వం అందించే సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని ప్రైవేటు భద్రతా సంస్థలను.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. ప్రైవేటు భద్రతా సంస్థలకు లైసెన్సులు ఇవ్వడానికి హోంశాఖ అధీనంలో నడిచే ప్రత్యేక పోర్టల్‌ను అమిత్ షా దిల్లీలో మంగళవారం ప్రారంభించారు.
సెక్యురిటీ గార్డులకు జన్‌ధన్ ఖాతాల ద్వారా జీత భత్యాలు అందించాలని హోంమంత్రి సూచించారు. ఎన్సీసీ శిక్షణ పొందినవారికి భద్రత విషయాలపై కనీస అవగాహన ఉంటుందని.. వారిని చేర్చుకునేందుకు ప్రైవేటు భద్రతా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
దేశంలో పోలీసులు, పారామిలటరీ దళాలు కలిపి 30 లక్షల మంది ఉంటే.. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు మాత్రం 90 లక్షల మంది ఉన్నారని అమిత్ షా తెలిపారు.
"జనధన్ ఖాతాలను, సామాజిక సురక్షా బీమా పథకాన్ని మీరు(ప్రైవేటు సెక్యూరిటీ సంస్ధలు) ఉపయోగించుకోవాలి. జనధన్ ఖాతాలోనే డబ్బులు జమ చేయాలి. ఈ విషయాలపై మీరు అంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి. రూ.2లక్షలకు 24 రూపాయల ప్రీమియంను కార్మికుల సంక్షేమం కోసం మీరు చెల్లించలేరా?. తమ వద్ద ఉన్న సెక్యురిటీ గార్డుకు 2లక్షల రూపాయల బీమాను తప్పక చేయిస్తానని అన్ని ప్రైవేటు సెక్యూరిటీ సంస్ధలు నిర్ణయం తీసుకోవాలి. చెమటను చిందించి మీ సంస్ధను నడిపిస్తూ, మీ వ్యాపారానికి కీలకంగా మారిన సెక్యూరిటీ గార్డుల కోసం ఏడాదికి 24 రూపాయల ప్రీమియం చెల్లించడం పెద్ద మాట కాదు. సెక్యూరిటీ గార్డు సంక్షేమం కోసం ఆలోచించాలి. కనీస వేతనం, ఆరోగ్య పరీక్షల గురించి ఆలోచించాలి. ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్రం ఆయుష్మాన్ భారత్ కార్డులను కూడా ఇస్తోంది. వీటి మీద అవగాహన కల్పించేందుకు మీరు కృషి చేయాలి."
--- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
ఇదీ చూడండి:-సూర్యుడితో సెల్ఫీ దిగుతూ లోయలో పడిన మహిళ