అయోధ్య కేసులో జాప్యానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్లో ప్రచార శంఖారావాన్ని పూరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మనీకా, లోహర్దగ్గాలలో ర్యాలీలు నిర్వహించారు కేంద్ర మంత్రి.
''ప్రతి ఒక్కరూ అయోధ్యలో రామ మందిరం కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ ఈ కేసును నాన్చుకుంటూ వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి తీర్పు రాలేదు. రాజ్యాంగానికి లోబడి ఈ వివాదానికి సరైన పరిష్కారం రావాలని మేం కోరుకున్నాం. ఇప్పుడు రాముని ఆశీర్వాదంతో.. రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది.''
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం సహా.. 70 ఏళ్లుగా ఉన్న కశ్మీర్ సమస్య పరిష్కారాన్నీ కాంగ్రెస్ ఆలస్యం చేసిందన్నారు షా.
'' కేవలం ఓటు బ్యాంకును కాపాడుకోవాలనే దురాశతో.. 70 ఏళ్లుగా కశ్మీర్ సమస్యను కాంగ్రెస్ అట్టిపెట్టుకొని ఉంది. కానీ మోదీ... భారత దేశ కిరీటం నుంచి అధికరణ 370 అనే కళంకాన్ని రద్దు చేసి.. కశ్మీర్ అభివృద్ధికి దారి చూపారు.''