ఖేలో ఇండియా నకిలీ ప్రకటనతో పలువురు అథ్లెట్లు మోసపోయారు. ఇది ప్రభుత్వ ప్రకటనే అని నమ్మి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి ఒక్కొక్కరు రూ. 6000 నష్టపోయారు. అనంతరం ఆ ప్రకటన నకిలీదని తెలుసుకుని భారత క్రీడా ప్రాధికార సంస్థ(శాయ్)కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉత్తర్ప్రదేశ్లో కేసు పెట్టింది శాయ్.
ప్రభుత్వ ప్రకటనలాగే..
2021లో హరియాణాలోని పంచకులలో జరగబోయే ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనడానికి అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలంటూ ఓ నకిలీ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అథ్లెట్లను నమ్మించడానికి దీనిని అచ్చం ప్రభుత్వ ప్రకటనలాగే క్రీడా మంత్రిత్వశాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ(శాయ్), ఖేలో ఇండియా లోగోలతో రూపొందించారు కేటుగాళ్లు.
అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవడానికి రూ. 6000 చెల్లించాలని కోరారు. ట్రయల్స్ తర్వాత ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. సందేహాలు ఉంటే సంప్రదించాలంటూ ఓ ఫోన్ నెంబరు కుడా పొందుపరిచారు. శాయ్ నిర్వహకుడిగా ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా వివరాలు ప్రకటనలో ఉంచారు.