దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో ఏడేళ్ల తర్వాత మృగాళ్లకు ఉరి బిగుసుకుంది. నిర్భయ తల్లి ఏడేళ్ల న్యాయపోరాటానికి నేడు ఫలితం దక్కింది. తెల్లవారుజామున 5.30 గంటలకు తలారీ పవన్ జల్లాడ్ ట్రిగ్గర్ నొక్కి శిక్షను అమలు చేశాడు.
చివరి ఘడియల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించినా దోషులకు ఫలితం దక్కలేదు. దోషుల్లో ఒకడైన పవన్ నేరం చేసినప్పుడు మైనర్ అని న్యాయవాది ఏపీ సింగ్ వాదించినా కోర్టు స్టే విధించేందుకు నిరాకరించింది. ఇప్పటికే ఈ అంశంలో దిల్లీ హైకోర్టు సహా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేసింది.
అంతకుముందు దిల్లీ హైకోర్టులో నిర్భయ దోషుల పిటిషన్‌పై వాడీవేడి వాదనలు జరిగాయి. పిటిషన్ సమర్పించిన పత్రాలపై కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. పిటిషన్‌లో అనెక్జర్, అఫిడవిట్, మెమోలు లేవని అసహనం వ్యక్తం చేసింది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో కోర్టులో జిరాక్స్ దుకాణాలు కూడా పనిచేయడం లేదని.. అందుకే తేలేకపోయామని దోషుల లాయర్ ఏపీ సింగ్ చెప్పారు. ఫొటో కాపీ మెషీన్లు లేవంటూ కహానీలు చెప్పొదని జడ్జి అన్నారు.
ఇంకా అవకాశాలు ఉన్నాయనీ..
దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని.. మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ పెండింగ్‌లో ఉందని, అలాంటప్పుడు దోషులను ఎలా ఉరితీస్తారని ఏపీ సింగ్ కోర్టును ప్రశ్నించారు. సింగ్ వాదనలు తమకు అర్థం కావడం లేదని.. కేవలం లీగల్ పాయింట్స్ మాట్లాడితే చాలు అని స్పష్టం చేసింది కోర్టు. సమయం గడిచిపోతోందని.. త్వరగా ముగించాలని ఒత్తిడి తెచ్చింది. మీ క్లయింట్‌లు దేవుడి దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమయిందని జడ్జి అన్నారు.
ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తకపోతే ఈ సమయంలో సాయం చేయలేదని ఖరాకండిగా చెప్పేసింది కోర్టు. వ్యవస్థతో ఎవరో ఆడుకుంటున్నారని.. రెండున్నరేళ్లు ఆలస్యంగా క్షమాభిక్ష పిటిషన్ వేయడం వెనక కుట్ర దాగున్నట్లు అనిపిస్తోందని అన్నారు. దోషుల తరపు లాయర్ మాత్రం.. న్యాయాన్ని చంపేస్తున్నారని కామెంట్ చేశారు తప్ప.. వాలిడ్ పాయింట్ మాత్రం చెప్పలేదు. ఫలితంగా ఆ పిటిషన్‌ను కొట్టివేశారు హైకోర్టు జడ్జి.