మగువలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఆరితేరుతున్న ఈ కాలంలోనూ.. పెళ్లి పేరిట వారి కలలను మొగ్గలోనే తుంచేస్తున్నారు తల్లిదండ్రులు. పెళ్లీడుకు రాని బాలబాలికలకు వివాహం చేయడం నేరమని తెలిసినా.. కర్ణాటక చామరాజ్నగర్లో ఒకే రోజు ఏడుగురు బాలికలకు పెళ్లి ముహుర్తాలు పెట్టేశారు. అయితే, సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ పెళ్లిళ్లు జరగకుండా అడ్డుకోగలిగారు.
ఇందిగంట గ్రామంలో 15 ఏళ్ల బాలికకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం రాగానే, ముహుర్త సమయానికి కొద్ది గంటల ముందు ఆ ఇంటికి చేరుకుని, పెళ్లి ఆపేశారు అధికారులు. అరకలవాడిలో 16 ఏళ్ల అమ్మాయి, వై.కే.మోలే గ్రామంలో 14 ఏళ్ల బాలికనూ ఇలాగే కాపాడారు. అమచావడి, శెట్టితల్లి గ్రామాల్లోనూ బాల్య వివాహాలను అడ్డుకున్నారు.