సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా వాయుసేన కదలికలపై భారత నిఘా ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్ నుంచి ఆరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాయుసేన కదలికలపై నిఘా ఉంచాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
"టిబెట్, జిన్జియాంగ్ ప్రాంతాల్లోని హొటన్, ఝార్ గున్సా, కష్ఘర్, హాపింగ్, ఢొంగా జాంగ్, లింఝి, పన్ఘాట్ వాయుస్థావరాలపై నిఘా పెట్టాం. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు భారీగా పెరిగాయి."
- ప్రభుత్వ వర్గాలు
ఈ స్థావరాల్లో చైనా వాయుసేన వివిధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటోంది. గుడారాలు, రన్‌వే పొడిగింపు, అదనపు మానవ వనరులను సమకూర్చుకుంటోందని సమాచారం. ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలోని లింఝిలో భారీగా హెలిపాడ్లను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలపై నిఘా పెట్టేందుకు చైనా ఈ చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
విమానాల మోహరింపు..
లద్దాఖ్ సెక్టార్ సమీపంలో సుఖోయ్-30, జే- శ్రేణి విమానాలను చైనా మోహరించినట్లు తెలుస్తోంది. వీటిపైనా భారత ఏజెన్సీలు శాటిలైట్, ఇతర మార్గాల ద్వారా దృష్టి సారించినట్లు సమాచారం. చైనా దూకుడు నేపథ్యంలో దీటుగా స్పందించేందుకు భారత్ కూడా అప్రమత్తమైంది. లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29ఎస్, మిరేజ్-2000 యుద్ధ విమానాలను భారీగా మోహరించింది.
ఇదీ చూడండి:'సరిహద్దు సమస్యకు వేగవంతమైన పరిష్కారానికి కృషి'