పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ రూపొందిస్తున్న కరోనా వైరస్ టీకా.. డిసెంబర్ కల్లా సిద్ధమవ్వచ్చని ఆ సంస్థ సీఈవో అధార్ పునావాలా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. టీకా అందుబాటులోకి వచ్చే సరైన సమయం బ్రిటన్లో నిర్వహిస్తున్న ట్రయల్స్, డీసీజీఐ ఆమోదంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
"అత్యవసర అనుమతికి దరఖాస్తు చేసుకోకపోతే.. డిసెంబర్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో వ్యాక్సిన్ను తీసుకువస్తాం. ఆ సమయానికి యూకేలోనూ ట్రయల్స్ పూర్తవుతాయి. టీకాపై వారి అధ్యయనానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకొని సురక్షితమేనని అనుకున్నప్పుడు రెండు మూడు వారాల ముందు అత్యవసర అనుమతికి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంటాం. అప్పుడు డిసెంబర్ నాటికి టీకా అందుబాటులోకి తెస్తాం. కానీ ఆ అంశం కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుంది."