ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్యాండిడేట్ రెండు, మూడు దశల హ్యూమన్ క్లినకల్ ట్రయల్స్ కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ).. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అనుమతి కోరినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పుణెకు చెందిన ఎస్ఐఐ.. కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం డీసీజీఐ అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా భారతీయ వయోజనుల్లో 'కొవిషీల్డ్(కొవిడ్-19)' భద్రత, రోగ నిరోధక శక్తిని గుర్తించనున్నట్లు ఎస్ఐఐ తన దరఖాస్తులో పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో 18 ఏళ్లు నిండిన వారు సుమారు 1600 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆ సంస్థ స్పష్టం చేసింది.
బ్రిటన్‌లో సత్ఫలితాలు..
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తొలి రెండు దశల ట్రయల్స్‌ను బ్రిటన్‌లోని 5 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. ఆ పరీక్షల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
100 కోట్ల డోసుల ఉత్పత్తి..
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా.. 100 కోట్లు డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. బ్రిటీష్- స్వీడిష్ కంపెనీ అస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు భారత్‌తో సహా ప్రపంచంలోని మధ్య, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఎస్ఐఐ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. అందులో భాగంగానే వచ్చే నెలలో హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి:ఆ సంస్థల కొవిడ్ కిట్ల దిగుమతి లైసెన్సులు రద్దు